ఇటీవల బీజేపీ కీలక నేత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ నేపథ్యంలో ఏపీ అధికారపక్షానికి.. కమలనాథులకు మధ్య కనిపించని స్నేహం వెల్లివెరిస్తుందన్న వ్యాఖ్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే.. ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగున్నాయని చెబుతుంటారు.అయితే.. జగన్ తో తాము జట్టు కట్టలేమని బీజేపీ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఇప్పటివరకు అయితే లేదు.
అంటిముట్టనట్లుగా ఉండటం.. ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకోవటం లాంటి తొందరపాటు పనులు చేపట్టని తీరు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల్ని చూసే సునీల్ దేవ్ ధర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకు చెప్పినట్లుగా పబ్లిష్ అయిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వాదనలకు తెర తీసేలా ఉన్నాయి.
రానున్న రోజుల్లో బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ జట్టు కడుతుందా? లేదా.. ఎన్డీయేలో జగన్ పార్టీ భాగస్వామ్యం అవుతుందా? లాంటి ప్రశ్నలకు నో చెప్పేస్తున్నారు సునీల్ దేవ్ ధర్. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. జగన్ పార్టీని అవినీతి పార్టీగా అభివర్ణించటం షాకింగ్ గా మారింది. ప్రధాని మోడీతో ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్ భేటీ అయ్యారే తప్పించి..దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమీ లేదని పేర్కొన్నారు.
ప్రధానితో భేటీని రాజకీయ రంగు పులమటం సరికాదంటున్న సునీల్ దేవధర్.. తమతో జగన్ పార్టీని ఎలా జట్టు కట్టుకుంటామన్న మాట విన్నంతనే చివుక్కుమనేలా మాట్లాడటం గమనార్హం. బీజేపీ.. జనసేన రెండు పార్టీలు రెండు కలిసి జట్టు కట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాయని చెప్పారు. టీడీపీతోనూ.. ఏపీ అధికారపక్షంతోనే సమాన దూరాన్ని పాటిస్తామని స్పష్టం చేసిన ఆయన మాటలు ఎలా ఉన్నా.. జగన్ పార్టీని మాత్రం అవినీతి పార్టీ అంటూ పుసుక్కున అన్న మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ నెలలో రెండు విడతలుగా 14 మంది ముఖ్యమంత్రి ప్రధాని మోదీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి అని రఘురామరాజు కూడా చెప్పిన విషయం విదితమే.