2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా బుగ్గన…తిరువళ్లువార్ రచించిన తిరుక్కురాళ్ గ్రంథంలోని సూక్తులను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో బుగ్గన బడ్జెట్ పై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. అది గొప్ప గ్రంథం అని, ప్రధాని మోడీ నుంచి నిర్మలా సీతారామన్ వరకు అంతా ఆ అంశాలను ప్రస్తావించారని ఐవైఆర్ అన్నారు.
కానీ, తెలుగులో దిగ్గజ కవులైన వారిని బుగ్గన విస్మరించారని, సుమతీ శతకం, వేమన శతకం, తిక్కన భారతం, పోతన భాగవతం, ఇతర తెలుగు గ్రంథాల నుంచి ప్రస్తావించకుండా తిరుక్కురాళ్ నుంచి ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటో అర్థంకావడం లేదని అన్నారు. జగన్ ను పొగడడమే బుగ్గన లక్ష్యమైతే రాజరాజనరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, కొండవీటి రెడ్డిరాజులతో పోలిస్తే సరిపోయేదని ఐవైఆర్ సెటైర్లు వేశారు.
పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్నారని ఐవైఆర్ మండిపడ్డారు. కాగ్ లెక్కల ప్రకారం 2021-22లో 9 నెలలకు రెవెన్యూ లోటు రూ.45,900 కోట్లు అని వెల్లడించారు. కానీ ఈ బడ్జెట్లో రెవెన్యూ లోటును రూ.19,545 కోట్లుగా చూపించారని ఐవైఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మిగిలిన 3 నెలలు కలుపుకున్నా కూడా…ఈ రెవెన్యూ లోటు రూ.45,900 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలని, కానీ తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
అయితే, మిగిలిన 3 నెలల్లో చెల్లింపులు చేయకుండా ఖర్చులు తగ్గించి చూపడం ద్వారా మసిపూసి మారేడుకాయ చేసి కృత్రిమంగా రెవెన్యూ లోటును తగ్గించారని విమర్శించారు. దీని ప్రభావం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల విషయంలోనూ ఇలాగా అవకతవకలుగా లెక్కలు చూపించారని ఆరోపించారు. కరోనా వల్లే అప్పులు చేస్తున్నామని బుగ్గన అన్నారని, కానీ గవర్నర్ ప్రసంగంలో ఆదాయంపై కరోనా ప్రభావం లేదని చెప్పారని గుర్తుచేశారు.
ఇక, బడ్జెటేతర అప్పుల వివరాలివ్వాలని కాగ్ 2021లో రాసిన లేఖకు జగన్ సర్కార్ సమాధానమివ్వలేదని ఐవైఆర్ ఆరోపించారు. కాగ్ కు కూడా ఇవ్వకుండా ఆ అప్పులను ఇంత రహస్యంగా ఉంచారంటే, ఏ స్థాయిలో బడ్జెటేతర అప్పులు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషించారు. అప్పులు చెయ్యి, పంచు అనే పద్ధతిలోనే జగన్ హయాంలో బడ్జెట్లన్నీ కనిపిస్తున్నాయని అన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లి జగన్ కు అదృష్టం కలిసొచ్చి మళ్లీ సీఎం అయితే ఈ పథకాలను ఆపేస్తారేమోనని అన్నారు. నవరత్నాల్లోని ఒక రత్నాన్ని విస్మరించడం ద్వారా మద్యం ఆదాయం విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు.