సర్పంచ్ పదవి-చెప్పుకోవడానికి బాగుంటుంది.. కానీ, ఒక గ్రామానికే పరిమితం. పైగా రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి కొనసాగే పాలన ఇప్పుడు పంచాయతీల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమ యంలో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అందుకే చాలా రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులు దొరక్క ఎవరు కనిపిస్తే వారిని తీసేసుకుని.. పోటీలో పెట్టుకుంటు న్నారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా అయిపోతున్నాయి.
ఏదో ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. అయితే ఉండే డిమాండ్ వేరుగా ఉంటుంది. కానీ, పంజాబ్‌లోని హర్దోవల్ కలన్ అనే గ్రామంలో మాత్రం సర్పంచ్ పదవి కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం పంజాబ్ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 13237 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుండగా.. మరొకొన్ని పంచాయతీల్లో మాత్రం వేలంపాటలు వేసుకుని సర్పంచులను ఎన్నుకుంటున్నారు.
ఇలానే హర్దోవల్ కలన్ అనే గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం వేశారు. రూ.50 లక్షలతో ప్రారంభమైన వేలం పాట ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు పలికింది. స్థానిక బీజేపీ మద్దతు దారుగా ఉన్న ఆత్మాసింగ్ ఈ పదవిని దక్కించుకున్నారు. అయితే.. టెన్నకల్ గా మాత్రం ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ, ఆత్మా సింగ్ పాడుకున్న నేపథ్యంలో ఆయన తప్ప ఇంకెవరు నామినేషన్ వేయబోరు. దీంతో ఆయనను ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ సొమ్ము ఏం చేస్తారు?
ఆత్మాసింగ్ రూ.2 కోట్ల మొత్తానికి సర్పంచ్ పదవిని పాడుకున్న నేపథ్యంలో ఆ సొమ్మును.. ఆయన గ్రామానికి సంబంధించిన అకౌంట్లో జమ చేస్తారు. దీని నుంచి వచ్చే వడ్డీతో గ్రామాన్ని అభివృద్ది చేయనున్నారు. ఇదిలావుంటే.. సర్పంచ్‌గా ఆత్మాసింగ్కు వచ్చే జీతం 8500 రూపాయలు మాత్రమే. ఇక, హక్కులు, అధికారాలు మాత్రం కామన్‌గానే ఉంటాయి.
పొలిటికల్ వివాదం..
ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీలు పట్టుగొమ్మలు కావడంతో.. ఇక్కడ ప్రజా పాలన జరగాలంటే.. ఎన్నికలు జరగాలన్నది నియమం. అయితే.. తాజా వేలం పాటపై ప్రజాస్వామ్య వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది బహిరంగ అవినీతి అని, ఇలాంటి ఎన్నిక అధికారికం కాదని వారు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి బాధ్యులను జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.