రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బీజేపీ నాయకులు పవన్‌ను అవమానిస్తున్నారా? లేక.. తక్కువగా అంచనా వేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. 2014లోను, ఇటీవల కూడా బీజేపీనే కావాలని.. పవన్ మద్దతు కోరింది. అప్పట్లో సీనియర్ నేత కంభంపాటి హరిబాబు.. తదితరులు.. పవన్ చెంతకు వెళ్లి.. ఆయన మద్దతు కోరారు. ఆయన కోసం హైదరాబాద్‌లో పడిగాపులు పడ్డారు. ఇక, ఆయన 2014లో మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే బీజేపీ రెండు ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుందని అప్పట్లో బీజేపీ నేతలే చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. మధ్యలో పరిణామాలను పక్కన పెడితే.. ఇప్పుడు కూడా బీజేపీ నేతలు.. తమంతట తామే.. వచ్చి.. పవన్‌తో చెలిమికి పాకులాడారు. కీలక నేతలు.. హైదరాబాద్‌లో మకాం వేసి మరీ.. పవన్‌ను తోడ్కొని.. ఢిల్లీ తీసుకువెళ్లి.. బీజేపీకి మద్దతు ఇచ్చేలా చక్రం తిప్పారు. పునాదులు లేని పార్టీని బలోపేతం చేసుకునేలా ఏపీలో పుంజుకునేలా ఉన్న ఏకైక ఆయుధం పవన్ మాత్రమేనని గుర్తించి.. ఆదిశగా వేసిన అడుగులు ఫలించాయి. ఇలా.. ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణలోనూ బీజేపీ పవన్‌పై ఆధాపడింది. ఇటీవల ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ పవన్‌ను తమకు అండగా మలుచుకోవడం పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు.
ఈ క్రమంలోనే పవన్ ఏకంగా.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పి కూడా దూరమయ్యారు. తన జనసేన కార్యకర్తలను ఆయన రంగంలోకి దింపారు. ఇంతలా.. బీజేపీ కోసం.. పవన్ ప్రయత్నాలు చేస్తే.. మరి బీజేపీ ఏం చేసింది.? అనేది కీలక ప్రశ్న. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ కేటాయింపు విషయాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసిన.. రాష్ట్ర బీజేపీ నేతలు.. ఆ విషయం తేలకుండానే.. అనధికార ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభించేశారు. అంతేకాదు.. తిరుపతిలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. “జనసేన బలపరిచే.. బీజేపీ అభ్యర్థే ఇక్కడ పోటీ చేయడం ఖాయం“ అని కుండబద్దలు కొట్టారు.
నిజానికి తిరుపతి టికెట్ అంశం ఎటూ తేలకుండానే.. పవన్ తన మనసులో కోరికను బయట పెట్టి.. గ్రేటర్లో మీకు సహకరించానుకనుక తిరుపతి నాకు వదిలేమని.. కోరిన తర్వాత.. దీనిపై ఒక నిర్ణయానికి రాకుండా.. పవన్ నుంచి ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండానే సోము వంటి కీలక నేత ఇలా వ్యాఖ్యానించడం అంటే.. పవన్‌ను అవమానించడమా? లేక .. ఆయనను తక్కువ చేయడమా? ఇదే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.