మునుగోడు ఉప పోరులో ఓటమిని చవిచూసినా.. బీజేపీ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్టుగా కామెంట్లు కుమ్మరిస్తోంది. సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ తాజాగా సవాల్ రువ్వారు. “ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని టీఆర్ ఎస్‌లో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పుకోరే దమ్ముందా? మునుగోడు గెలుపు కేసీఆర్ దా? కేటీఆర్‌దా? హరీశ్‌రావుదా? సీపీఐదా, సీపీఎందా? కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి.“ అని సవాల్ రువ్వారు.
ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల మెజార్టీయేనని ఎద్దేవా చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున కార్యకర్త పనిచేశారని తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యే.. బీజేపీ కార్యకర్తతో సమానమని విమర్శించారు. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, మునుగోడు ఓటమితో బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని బండి పిలుపునిచ్చారు.
ఓటమిపై సమీక్ష చేసుకుంటామన్నారు. అధికారమే లక్ష్యంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. “మునుగోడు గెలుపు.. కొందరు పోలీసు అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ది. ఎక్కడా కూడా టీఆర్ ఎస్ డబ్బులు పట్టుబడకుండా.. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌ల ద్వారా డబ్బు తరలించారు. ఉప ఎన్నిక కోసం రూ.వెయ్యి కోట్లు పంచింది’’ అని బండి సంజయ్ ఆరోపించారు.
మునుగోడు ప్రజలకు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,480 ఓట్లు (40శాతం) వచ్చాయి. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాం. టీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎంత విర్రవీగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
గెలిచిన తర్వాత 15 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు. ఎన్నికల హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చాల్సిందే. కానీ, ఆ విషయం చెప్పకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరితే, పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంభిస్తున్నాం“ అని బండి అన్నారు. కానీ, టీఆర్ ఎస్ మాత్రం ఎలాంటి ప్రజాతీర్పు కోరకుండానే వారికి మంత్రి పదవులు ఇస్తోందని విమర్శలు గుప్పించారు.