రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలవాలన్నది బీజేపీ టార్గెట్. మొత్తం 17 సీట్లనూ గెలుచుకుంటామని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే అది సాధ్యంకాదని ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకనే కనీసం మెజారిటి స్ధానాలను గెలుచుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బీజేపీ పట్టుదల అంటే అగ్రనేతలే చాలా పట్టుదలగా ఉన్నారు. విషయం ఏమిటంటే రామజన్మభూమిలో రామాలయం నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి జనాల్లో బాగా సానుకూలత పెరిగిందని నరేంద్రమోడి, అమిత్ షా తదితరులు భావిస్తున్నారు.
ఈ భావనతోనే దేశవ్యాప్తంగా బీజేపీకి 370 సీట్లు వస్తాయని పదేపదే ప్రకటిస్తున్నది. అంచనా వేసుకుంటున్న 370 సీట్లలో దక్షిణాది షేర్ ఎంతన్నది ఇక్కడ కీలకమైంది. ఇందులో తమిళనాడు, కేరళ, ఏపీలో బోణి కొట్టడం కష్టమే. ఇక మిగిలింది కర్నాటక, తెలంగాణా, పాండిచ్చేరి మాత్రమే. కర్నాటకలో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. పాండిచ్చేరి కూడా వేస్టే అందుకనే తెలంగాణా మీద మాత్రమే మోడి, అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. 17 సీట్లంటే మామూలు విషయంకాదు. అందుకనే తెలంగాణాలో రెండురోజులు మోడి పర్యటించారు.
ఈనెల 12వ తేదీన అమిత్ షా ప్రకటించబోతున్నారు. అమిత్ రెగ్యులర్ గా తెలంగాణాలో పర్యటిస్తునే ఉన్నారు. అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పదేపదే తెలంగాణాకు వస్తున్నారు. వీళ్ళు కాకుండా కేంద్ర మంత్రులు, పార్టీలో కీలక నేతలు కూడా వరుసగా తెలంగాణాలో పర్యటిస్తునే ఉన్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే తక్కువలో తక్కువ 10 సీట్లన్నా గెలుచుకోవాల్సిందే అన్నట్లుగా ఉంది. మరి అన్ని స్ధానాల్లో గెలుపు సాధ్యమేనా అన్నది కీలకమైంది.
ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ జనాల్లో సానుకూలతను పెంచుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది. మిగిలిన రెండు హామీలను అమలు చేయడానికి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. కాబట్టే పార్టీతో పాటు ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత పెరుగుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రజల్లో నెగిటివిటి లేకపోతే పాజిటివిటీ ఉన్నట్లగానే అనుకోవాలి. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జనాలు ఎవరిని ఆదిరిస్తారో చూడాలి.