రాష్ట్ర బీజేపీ నేతలు.. రాయలసీమపై దృష్టి పెట్టారు. ఇక్కడ పార్టీని డెవలప్ చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు భారీ ఎత్తున సంకే తాలు పంపుతున్నారు. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. 2024లో కాపు నాయకుడే సీఎం అవుతారని.. పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి భిన్నంగా మిగిలిన ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలను వదిలేసి.. కేవలం సీమపై పడడమే ఇప్పుడు బీజేపీకి కలిసివచ్చే పరిణామమేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఒకరకంగా చూసుకుంటే.. నాయక బలం(ప్రజాప్రతినిధులు కాకపోయినా.. ప్రజల్లో గెలవకపోయినా) సీమలోనే బీజేపీకి ఇప్పుడు ఎక్కువగా ఉంది.
విష్ణువర్థన్‌రెడ్డి, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, టీజీ వెంకటేశ్(కర్నూలు), వరదాపురం సూరి(అనంతపురం) వంటివారు బీజేపీలోనే ఉన్నారు. ఇక, తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి దూకుడు బాగానే ఉంది. అయితే.. ఇది ఏమేరకు బీజేపీకి కలిసి వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విష్ణు, సీఎం రమేష్ వంటి వారు.. ప్రజా నేతలుగా మార్కులు వేయించుకోలేక పోయారు. భాను ప్రకాశ్ రెడ్డిదీ అదే పరిస్థితి. ఇక, టీజీ గెలిచి రెండు ఎన్నికలు ముగిశాయి. గెలుపు గుర్రం ఎక్కలేకే రాజ్యసభకు ప్రమోట్ చేయించుకున్నారని అంటారు. ఇక, ఆదినారాయణరెడ్డి గత ఏడాది ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఇలాంటి వారిని అడ్డు పెట్టుకుని బీజేపీ ఎదుగుతుందా? అనేది ప్రశ్న.
పోనీ.. సీమలో ప్రాజెక్టులు కడతాం.. 20 వేల కోట్లను కేటాయిస్తాం. తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న సోము.. వీటిని ఎలా చేస్తారో.. మాత్రం రోడ్ మ్యాప్‌ను వివరించలేక పోతున్నారు. అప్పుడెప్పుడో తిరుపతి పార్లమెంటులో ఒకసారి గెలిచిన తర్వాత.. మళ్లీ సీమలో బీజేపీ గళం వినిపించిన నాయకుడు కనుచూపు మేరలో కనిపించలేదు. ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీనే సీమలో రాజకీయ గతుకుల రోడ్డుపై సైకిల్ సవారీ చేయలేక ఆపశోపాలు పడుతోంది. మరి సంస్థాగతంగా, నాయకత్వ పరంగా కూడా బలంలేని బీజేపీ ఎలా సీమలో పాగా వేస్తుందో చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు. కేవలం తిరుపతి పార్లమెంటు ఉప పోరులో గెలుపే ధ్యేయంగా సోము ముందుకు వెళ్తున్నారనే భావన వ్యక్తమవుతోంది.
కానీ, ఒక్క పార్లమెంటు స్థానంలో గెలుపు కోసం(ఇంకా టికెట్ ఎవరికనేది కన్ఫర్మ్ కాలేదు) మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తే.. మున్ముందు తాను పెట్టుకున్న అధికారంలోకి రావడమనే లక్ష్యానికి బీటలు పడదా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది.. రాజధాని సమస్య ఓ అనంత ప్రశ్నగా మిగిలిపోతోంది. ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఆశలు ఇంకా చిగిరించే ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి.. ఉట్టి కెగరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరినట్టుగా .. సీమలో బలపడతామని చెప్పడం.. సోము వీర్రాజు అతికి నిదర్శనంగా కాదా? అనేది విశ్లేషకుల ప్రశ్న. కోస్తాలోని నాలుగు జిల్లాల్లో బీజేపీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ మాత్రం వీర్రాజు పట్టించుకోకుండా.. వైసీపీ బలంగా ఉన్న సీమను ఎంచుకోవడం.. సాహసమే అవుతుందని అంటున్నారు.