కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన రాద్ధాంతం చాలా విచిత్రంగా ఉంది. రేషన్ షాపులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటో పెట్టలేదని కేంద్ర మంత్రి పెద్ద రాద్దాంతమే చేశారు. పేదలకు రేషన్ షాపుల ద్వారా అందుతున్న బియ్యం తమకు ఎవరిస్తున్నారనే విషయం లబ్దిదారులకు తెలియాలని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారు. వెంటనే నరేంద్రమోడీ ఫొటో పెట్టకపోతే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మళ్ళీ రెండు రోజుల్లో తాను వస్తానని అప్పటికి ఫొటో ఉండి తీరాల్సిందే అని నిర్మల ఆదేశాలు చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ ఫొటో పెట్టడమా లేకపోతే కేసీయార్ పొటో పెట్టడమా అన్నది కలెక్టర్ ఇష్టప్రకారం జరగదు. రేషన్ షాపులో మోడీ ఫొటో లేదన్న కారణంగా జనాలు, బీజేపీ నేతలు, కార్యకర్తల ముందు జిల్లా కలెక్టర్ ను కేంద్ర మంత్రి అవమానించటం చాలా అభ్యంతరకరమే. రాజకీయంగా కేసీయార్ అండ్ కో పై తీర్చుకోవాల్సిన లెక్కలను కేంద్ర మంత్రి ఒక కలెక్టర్ మీద చూపించటం చాలా విచిత్రంగా ఉంది.
షాపులో ఎవరి ఫొటో ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడుంటుందని కేంద్రమంత్రికి తెలీదా ? రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను అమలు చేయటం తప్ప జిల్లాల కలెక్టర్లు చేయగలిగేదేం ఉంటుంది ? కేసీయార్ ఫొటో పెట్టమంటే పెడతారు, మోడీ ఫొటోను పెట్టమంటే పెడతారంతే. రేషన్ షాపుల్లో మోడీ ఫొటో ఉంచమని నిర్మల చెప్పాల్సింది కేసీయార్ కే కానీ కలెక్టర్ కు కాదు. ఏ కలెక్టర్ కూడా తన ఆధీనంలో పనిచేయరని కేంద్రమంత్రికి అంత మాత్రం తెలీదా ?
కేసీయార్ మీద కోపాన్ని కలెక్టర్ మీద చూపిస్తే ఉపయోగం ఏముంటుంది ? పైగా రేషన్ షాపులో మోడీ ఫొటో పెట్టమని బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఫొటోలు పెట్టుసుకోవటానికి ఇదేమన్నా ఫొటో ఎగ్జిబిషననా ? మొత్తానికి నిర్మల ఓవర్ యాక్షన్ పై రేషన్ షాపుల వాళ్ళంతా మండిపోతున్నారు. ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాల్సిందే.
Comments 1