తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగితేనే వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి మెజారిటీ రాదన్న విషయం అర్థం కావడంతో వైసీపీ నేతలు భారీ స్థాయిలో నకిలీ ఓటర్లను తిరుపతిలో దించడం విమర్శలకు తావిచ్చింది. ఇక, ఈ దొంగ ఓటర్లను టీడీపీ, బీజేపీ అభ్యర్దులు పనబాక లక్ష్మి, రత్నప్రభ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో రత్నప్రభ పలు అంశాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరు, దొంగ ఓట్లు వేసిస వైనాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కొందరు దొంగ ఓటర్లను తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని రత్నప్రభ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
తిరుపతిలో తాము పట్టుకున్న దొంగ ఓటర్లు తమ పేరు, తల్లితండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోయారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కానీ, ప్రధాన ఎన్నికల అధికారి కానీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. మరోవైపు, ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తాజాగా రత్నప్రభ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో దొంగ ఓటర్లపై హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.