ఎట్టకేలకు చిక్కుముడులు వీడిపోయాయి. సస్పెన్స్ తీరిపోయింది. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టనున్నారన్న అంశంపై యావత్ ప్రపంచం ఉత్కంట ఒక కొలిక్కి వచ్చింది. డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలోకి దిగిన జో బైడెన్ విజయాన్ని సాధించారు. ట్రంప్ మీద విజయం నల్లేరు మీద నడకగా సర్వేలు పేర్కొన్నప్పటికీ.. అదంత తేలికైన విషయం కాదన్నది ఫలితాల వెల్లడిని చూస్తే అర్థమవుతుంది. చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లుగా ఫలితాలు వచ్చినప్పటికి.. అవసరమైన మెజార్టీకి ఏకంగా 20 ఎలక్టోరల్ సీట్లను బైడెన్ సొంతం చేసుకున్నారు.
ఇక..ఆయన జీవితంలో అత్యంత కీలకమైన 8 అంశాల్ని చూస్తే.. ఆయన ప్రయాణం ఎలా సాగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
– నవంబరు 7న అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన జో బెడన్.. అదే నవంబరులోనే పెన్సిల్వేనియాలోని స్ర్కాంటన్ లో 1942లో పుట్టారు.
– 1966లో ఆయన నీలియా హుంటర్ తో వివాహమైంది
– 1972 నవంబరు 7న తొలిసారి దెలవారె నుంచి సెనెటర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన కారు ప్రమాదంలో భార్య.. కుమార్తె మరణించారు. ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి.
– 1977లో జిల్ జాకోబ్స్ తో ఆయన రెండో పెళ్లి జరిగింది. వారికి ఒక కుమార్తె ఉన్నారు
– 2008లో అధ్యక్ష బరిలో దిగిన ఆయన.. ఆ తర్వాత వైదొలిగారు. అయినప్పటికీ ఆయన పోటీ పడ్డ ఒబామా ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు
– 2009లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన 2017 వరకు రెండు దఫాలు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు
– 2015లో పెద్ద కుమారుడు బ్రెయిన్ కేన్సర్ తో మరణించారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీ పడ్డారు. తర్వాత పోటీ నుంచి వైదొలిగారు.
– 2020లో అధ్యక్ష బరిలో మరోసారి నిలిచిన ఆయన.. ఎట్టకేలకు తాను అనుకున్న అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తనతో అధ్యక్ష స్థానానికి పోటీ పడిన.. మనమ్మాయి కమలా హ్యారీస్ ను పోటీ నుంచి వైదొలిగిన తర్వాత.. ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసుకున్నారు. వారిద్దరు అద్భుతమైన విజయాన్ని సాధించారు.