చాలా అరుదుగా జరిగే పరిణామం ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. ఒకే రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. బిహార్ ఎన్నికల పోలింగ్ తో పాటు.. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. అమెరికా ఫలితం వచ్చేసింది. దుబ్బాక ఫలితంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బిహార్ లో పోలింగ్ దశ పూర్తైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే.. బిహార్ ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండబోతున్నాయన్న విషయాన్ని ఏడు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్.. ఆశ్చర్యపోయే ఫలితాన్ని వెల్లడించాయి. కాస్త తక్కువ కావొచ్చు.. మరికాస్త ఎక్కువ కావొచ్చు. ఎగ్జిట్ పోల్స్ సారాంశం ఒక్కటే. బిహార్ లో విజయం సాధించేది ఎన్డీయే కాదు.. ఆర్జేడీ నాయకత్వంలోని మహా ఘట్ బంధన్ అన్న విషయం తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుందని అందరూ అనుకన్న ఎల్జేపీ తేలిపోయింది. ఆ పార్టీకి ఒకటి నుంచి ఐదు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చారు.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే.. బిహార్ చరిత్రలో అపురూప ఘటన చోటు చేసుకున్నట్లే. ఈ రాష్ట్రానికి మూడు పదుల వయసున్న తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కావటమే కాదు.. ప్రధాని మోడీకి సైతం షాకిచ్చినట్లేనని చెప్పాలి. ఎన్నికల ప్రచార సమయంలో తేజస్వీపై మోడీ చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం.
తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో 44 శాతం మంది ఓటర్లు తేజస్వీని సీఎంగా ఎంపిక చేసుకునేందుకు మొగ్గు చూపినట్లుగా తేల్చారు. నితీశ్ వైపు కేవలం 35 శాతం మంది ఓటర్లే ఆసక్తి చూపినట్లుగా అర్థమవుతుంది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాలు. మొత్తం మూడు దశల్లో జిరిగిన పోలింగ్ లో బిహార్ పీఠం కోసం పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి.
తమ చేతిలో ఉన్న అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి జేడీయూ- బీజేపీ తహతహలాడుతుంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పవర్ తామే సొంతం చేసుకోవాలని మహాకూటమి భారీగా ప్రయత్నించింది. ఎన్నికల్లో కీలకభూమిక పోషించాలని భావించిన చిరాగ్ పాసవాన్ (ఎల్జేపీ) ఒంటరిగా పోటీ చేసి..ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారని చెబుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఎన్డీయే ఆర్జేడీ (మహాకూటమి)
ఇండియా టూడే 69-91 139-161
టుడేస్ చాణక్య 55 180
రిపబ్లిక్ టీవీ 104 128
ఏబీపీ న్యూస్ 116 120
టీవీ9 భారత్ వర్ష్ 115 120
పీపుల్స్ పల్స్ 90-110 100-115