ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నికల హామీల నుంచి సరికొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ సరికొత్త తాయిలాల్ని ప్రకటించింది. గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తూ.. ఈ ఎన్నికలు తనకెంత ముఖ్యమైనవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
శుక్రవారం బిహార్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. గడిచిన రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీశ్.. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించటానికి ఆయనో భారీ సంక్షేమ పథకాన్ని వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి మహిళ మనసుల్ని దోచేసిన నితీశ్.. తాజాగా మహిళల చూపు తమ పార్టీ మీద పడేలా.. కొత్త తాయిలాల్ని ప్రకటించారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు తాను ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని తాజా తాయిలంలో స్పష్టం చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాసైన బాలికలకు రూ.25వేలు.. డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయికి రూ.50వేలు అందిస్తామని వెల్లడించారు. అంతేకాదు.. నైపుణ్యాల్ని మరింత పెంచేందుకు కొత్త శాఖను తీసుకొస్తామని చెప్పారు. తమ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి హామీలు ఇచ్చారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వటం సాధ్యం కాదని.. అందుకే నైపుణ్యాల్ని పెంచటం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సౌకర్యాల్ని పెంచటం తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో సోలార్ వీధి దీపాలు.. చెత్త నిర్వహణ వ్యవస్థతో పాటు.. మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చనున్నట్లుగా హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న నితీశ్.. రానున్న ఐదేళ్లలో చేస్తానని చెబుతున్న అంశాలపై బిహార్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.