బీహారీలు ఈసారి చాలా విన్యాసాలు చేశారు. ఉత్తర భారతం నుంచి ఒక కొత్త నాయకుడిని సృష్టించారు. కాలగర్భంలో కలిసిపోతున్న కమ్యూనిస్టులను మళ్లీ బతికించారు. దక్షిణాది ముస్లిం పార్టీ ఎంఐఎంలో ఆశలు కల్పించారు. నితీష్ ను తొక్కేశారు. బీజేపీని బతికించారు. కాంగ్రెస్ ను నలిపేశారు. అబ్బ… అన్నీ విచిత్రాలే. దేనికదే సపరేటు.
బీహార్ మరీ పెద్ద రాష్ట్రం కూడా కాదు, 243 నియోజకవర్గాలున్నాయి. ఇందులోనే మూడు గ్రాండ్ అలయన్స్ లు పోటీ పడ్డాయి. అందుకే బీహార్ ప్రజలు కోరుకున్న తీర్పు కాకుండా వేరే వచ్చింది. బీహార్ ప్రజలు నితీష్ వద్దనుకున్నారు. అంటే నితీష్ కూటమికి ఓటు వేయొద్దనుకున్నారు. కానీ… నితీష్ కు ఓటు వేయొద్దనుకున్నపుడు ఒక్కడిని కాకుండా బీహార్ సమాజం చీలి అనేకమందిని ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో ఓట్ల చీలికలో బీజేపీ – నితీష్ కూటమి లాభ పడింది.
బీహార్ లో జరిగిన అతిపెద్ద విచిత్రం… కమ్యూనిస్టులు పోటీచేసిన స్థానాల ప్రకారం చూస్తే లెక్కించదగిన సీట్లు సాధించారు. దీనికి కారణం వారు ఆర్డేడీ కూటమితో కలిసి నడవడమే. ఆర్డేడీ కూటమితో కలవడంతో మళ్లీ కమ్యూనిస్టులకు పునర్జన్మ దక్కింది.
సీపీఎ (ఎంఎల్) 19 సీట్లలో పోటీ చేసి 12 సీట్లలో గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీపీఐ, సీపీఎం చెరో రెండు గెలిచాయి. అంటే మొత్తం 16 సీట్లను కమ్యూనిస్టులు గెలిచారు. 29 సీట్లు పోటీ చేసి 16 సీట్లు గెలవడం అసాధారణ విషయమే. విచారకరమైన విషయం ఏంటంటే… 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ మాత్రం కేవలం 19 సీట్లలో గెలిచింది. అంటే కాంగ్రెస్ వల్ల ఆర్జేడీ తేజస్వి కూటమి నష్టపోయింది.