దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. లోక్ నీతి – సీఎస్ డీఎస్ చేపట్టిన ఓపీనియన్ పోల్ ను తాజాగా విడుదల చేశారు. ఈ నెల 10 -17 తేదీల మధ్య నిర్వహించిన ఈ పోల్ సర్వేలో రాష్ట్రంలోని ఏడు కోట్ల ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక.. సర్వే ఫలితాల్ని చూస్తే.. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని పేర్కొంది.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 122 స్థానాలు అవసరమవుతాయి. అయితే.. తాజాగా వెల్లడైన సర్వేలో ఎన్డీయేకు 133-143 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందన్న అంచనాలు వెల్లడయ్యాయి. అదే సమయంలో అధికారం కోసం విపరీతంగా తపిస్తున్న మహా ఘఠ్ బంధన్ కు 88-98 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ ఎన్నికల్లో తరచూ అందరి నోట నానిన ఎల్ జేపీ 2-6 మధ్యలో సీట్లను సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. ఇక.. ఇతరులు 6-10 మధ్యలో సీట్లను సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది సీఎం నితీశ్ పాలన బాగుందన్న మాట రావటం గమనార్హం. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కారుపైనా సానుకూలత 61 శాతం మందిలో వ్యక్తమైనట్లుగా పేర్కొన్నారు. ఇక.. ఎన్డీయేకు గెలుపు దక్కే వీలుండటంతో నితీశ్ కచ్ఛితంగా సీఎం అయితే మంచిదన్న అభిప్రాయాన్ని 31 శాతం మంది కోరుతుంటే.. కొత్త నేతకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలని 34 శాతం మంది కోరుకోవటం గమనార్హం. మరో ఎనిమిది రోజుల్లో షురూ అయ్యే పోలింగ్ ప్రక్రియను మొత్తం మూడు దశల్లో విడుదల చేయనున్నారు. నవంబరు 10న బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరీ సర్వే వివరాలు ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి.