వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పై విజయవాడకు చెందిన ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన దగ్గర డబ్బులు తీసుకున్న నాగార్జున పీ.ఏ…ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదని, ఆ డబ్బులు నాగార్జున తరఫునే పీఏ తీసుకున్నారని ఆరోపించారు. తనను లైంగికంగా వాడుకొని మోసం చేశారని, తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆ కేసును సదరు మహిళ ఉపసంహరించుకోవడం సంచలనం రేపుతోంది.
తనపై నాగార్జున దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఆయనపై ఫిర్యాదు చేశానని సదరు బాధితురాలు హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కేసును ఉపసంహరించుకుంటున్నానని ప్రమాణ పత్రం దాఖలు చేశారు. అయితే, కోరిన వెంటనే కేసు కొట్టేయడం కుదరదని హైకోర్టు జడ్జి తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే ఫిర్యాదిదారు కూడా పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. అప్పటివరకు నాగార్జునను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నాగార్జున తరఫు లాయర్ కోరారు. కానీ, న్యాయమూర్త దానిని తోసిపుచ్చారు.