ఏపీలో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణను అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. అయితే, నాారాయణ బెయిల్ ను రద్దు చేయాలంటూ చిత్తూరు జిల్లా కోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆ బెయిల్ రద్దుపై జగన్ సర్కార్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్ విధించకుండానే నారాయణకు బెయిల్ ఇచ్చారంటూ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలుస్తోంది.
జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండడంతో మొక్కుబడిగా రివిజన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ జరిపిన చిత్తూరు జిల్లా కోర్టు నారాయణకు నోటీసులు జారీచేసింది. ఆ రివిజన్ పిటిషన్ పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో, ఈ నెల 24న చిత్తూరు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా నారాయణకు ఈ కేసులో తాజాగా మరో ఊరట లభించింది. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టు ఊరటనిచ్చింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వారు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా…దానిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను అదే రోజుకు కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు, ఇదే కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్ ప్రసాద్, వి.శ్రీనాథ్, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్, జి.సురేశ్‌కుమార్, ఎ.మునిశంకర్, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ పేర్లు నిందితుల జాబితాలో లేవని పేర్కొన్నారు. పిటిషనర్లు అసలు నిందితులే కాదుగనక… వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. వారిపై కూడా ఈ నెల 18 (బుధవారం) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.