సోషల్ మీడియాలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలు నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో 3 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్మకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ మూడు కేసులలో వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
వాస్తవానికి ఈ కేసులలో విచారణకు హాజరు కావాలని వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే, షూటింగులో బిజీగా ఉండి తర్వాత వస్తానంటూ వర్మ అన్నారు. ఓ దశలో వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కు ప్రకాశం జిల్లా పోలీసులు వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే, తనను అరెస్టు చేసేందుకు వారు రాలేదని, అదంతా మీడియా సృష్టి అని వర్మ అన్నారు. ఆ తర్వాత తన మార్కు లాజిక్కులతో వర్మ తన అరెస్టుపై రెండు,మూడు వీడియోలు విడుదల చేశారు.
తాను ఎక్కడికి పారిపోలేదని, షూటింగుల్లో బిజీగా ఉన్నానని అన్నారు. అయినా, ఎప్పుడో గతంలో చేసిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం, అది కూడా ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో ఒకేసారి కేసులు నమోదు కావడం ఏంటని వర్మ ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని వర్మ ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా వర్మకు మూడు కేసుల్లో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని వర్మను ఆదేశించింది.
కొన్ని షరతులు విధించింది. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశించింది. అదేవిధంగా విదేశాలకు వెళ్లరాదని, వెళ్లాలని అనుకుంటే కోర్టు అనుమతి తప్పని సరని స్పష్టం చేసింది. ఈ కేసు వ్యవహారంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టవద్దని, ప్రధాన మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని తెలిపింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది. దీంతో వర్మకు ముందస్తు బెయిల్ ఇచ్చినా.. విచారణ నుంచి ఆయన తప్పుకోలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం.