గత ఏడాది ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను కూడా కరోనా గడగడలాడించిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరం ప్రజలందరి జీవితాలతో 20-20 ఆడుకుంది. ప్రస్తుతానికి భారత్ లో మహమ్మారి వైరస్ తీవ్రత కాస్త తగ్గడం….అదే సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. కరోనా ధాటికి సామాన్య ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో సామాన్యులకు భారీ స్థాయిలో ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. ప్రజలు ఖర్చు చేసేందుకు వీలుగా వారికి నగదును అందించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టబోతున్నారట.
అయితే, ఇలా నగదును అందించడం వల్ల ప్రజలు డబ్బు ఖర్చు పెడతారని, దీంతో, మార్కెట్లో డిమాండ్ పెరిగి ఉద్యోగాలు, జీఎస్టీ ఆదాయం రెండూ పెరుగుతాయని కేంద్రం యోచిస్తోందట. అందుకే, ఈ బడ్జెట్ లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పన్ను శ్లాబుల్లో మార్పుగానీ.. స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో కానీ రూ.50,000-రూ.80,000 వరకు లబ్ధి చేకూరే అవకాశముందని తెలుస్తోంది. పన్ను విధించే ఆదాయం పరిధి పెంచడానికి కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ప్రభుత్వం మరో కొత్త శ్లాబ్‌ల విధానం ప్రవేశపెట్టినా….స్టాండర్డ్ డిడక్షన్ పెద్దగా లేదు. దీంతో, ఈ సారి బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్‌ను సుమారు రూ.లక్ష వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని సూచించింది. మరి, ఈ సారి బడ్జెట్ సామాన్యులకు ఊరటనిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.