జగన్మోహన్ రెడ్డికి సొంతజిల్లా కడప జనాలే షాక్ ఇచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం మండలముంది. ఈ మండలంలోని ఓబన్నపేట, సుగమంచిపల్లె గ్రామ పంచాయితీ సర్పంచుతో పాటు 14 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ప్రభుత్వంపై నిరసనగానే జనాలెవరు నామినేషన్లు వేయలేదని తెలుస్తోంది. అంటే ప్రభుత్వంపై తమలోని అసంతృప్తిని నామినేషన్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించటం ద్వారా జనాలు వ్యక్తంచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ విషయం ఏమిటంటే పై పంచాయితి గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉంది. ఈ రెండు పంచాయితీలను ప్రభుత్వం విలీనం చేసింది. అప్పట్లోనే తమ రెండు పంచాయితీలను విలీనం చేయద్దని గ్రామస్తులు మొత్తుకున్నారు. అయినా ప్రభుత్వం వీళ్ళను పట్టించుకోలేదు. రెండు పంచాయితీలను విలీనం చేయాలని అనుకున్న ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలి. స్ధానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సమస్యలు వాటి పరిష్కారాలపై కసరత్తు చేసి గ్రామస్తులను ఒప్పించి కానీ విలీనం చేసేందుకు లేదు.
అయితే పై కసరత్తుకు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తనిష్టం వచ్చిన రీతిలో విలీనం చేసేసింది. దానికి నిరసనగా ఇపుడు పై రెండు పంచాయితీలకు ఒక్క నామినేషన్ కూడా జనాలు వేయలేదు. అంటే ఎన్నికలను బహిష్కరించటం ద్వారా ప్రభుత్వంపై తమ నిరసనను ప్రజలు తెలిపినట్లయ్యింది. శుక్రవారం సాయంత్రానికి నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి సర్పంచి పదవులతో పాటు వార్డులకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఈ విషయం తెలిసినా జిల్లా అధికారులు, ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోయింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజాభిప్రయానికి విరుద్ధంగా నడుచుకుంటే పాలకులకు ఇలాంటి పరిస్ధితే ఎదురవుతుంది. అందులోను జగన్ సొంతజిల్లా కడపలోనే ఇలాంటి పరిస్ధితి ఎదురయ్యిందంటే అర్ధమేంటి ? ఎంపీ, ఎంఎల్ఏలు ఏమి చేస్తున్నట్లు ? మంత్రి దృష్టికి ఈ విషయం ఎందుకు రాలేదు ? సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు ఎంతోమంది ప్రజాప్రతినిధులున్న ఈ జిల్లాలో పై రెండు పంచాయితీల్లోని జనాలను ఎన్నికల్లో పాల్గొనేలా చేయలేకపోయారా ? వీరి సమస్యేంటో ముందే తెలుసుకుని జగన్ తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేట్లు చూసుంటే ఇపుడీ సమస్య ఉత్పన్నమయ్యేదికాదు.
ఇన్ని వేల పంచాయితీల్లో రెండు పంచాయితీలకు ఎన్నికలు జరగకపోతే ఏమవుతుంది ? ఇద్దరు సర్పంచులు, 14 వార్డు సభ్యులు లేకపోతే నష్టమేంటి ? అని అనుకుంటే ఎవరు చేసేదేమీ లేదు. కానీ అలా జరగకూడదు అని అనుకుంటే మాత్రం ప్రజాభిప్రాయానికి తగిన గౌరవం ఇవ్వాల్సిందే. రెండు పంచాయితీలకు, 14 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదంటే అది కచ్చితంగా జగన్ కు షాకనే చెప్పాలి. అందులోను సొంత జిల్లాలో అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.