ఏపీలోని పెండింగ్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళుతోంది. అయితే, ప్రకాశం జిల్లా దర్శి మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక, జగ్గయ్యపేటలో నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థిక శాఖా మంత్రి బుగ్గనకు షాక్ తగిలింది. కర్నూలు జిల్లాలో బుగ్గన నివాసం ఉండే బేతంచర్ల మునిసిపాలిటీలోని 15 వార్డులో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడంతో బుగ్గనకు షాక్ తగిలినట్లయింది. స్వయానా మంత్రి నివాసం ఉండే బేతంచెర్లలోని ఈ వార్డులో వైసీపీ ఓటమిని అక్కడి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బేతంచెర్లలో మొత్తం 20 వార్డులుండగా.. వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది. ఈ మునిసిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ…బుగ్గన నివాసముండే వార్డులో ఓటమి వారికి పరాభవంగా మిగిలింది.
మరోవైపు, గతంలో ఇదే జిల్లాలో జరిగిన సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో కూడా వైసీపీకి అనూహ్యంగా షాక్‌లు తగిలాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇక, ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.