ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులు ఒకరోజు తగ్గితే.. నాలుగు రోజులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మరణాల సంఖ్య కూడా దాదాపు 100కు అటు ఇటుగా ఉంటున్నాయి. కరోనా తగ్గిపోయిందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. పైగా మూడో వేవ్ వస్తుందనే వార్తల నేపథ్యంలో సీఎం జగన్ స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
ఇదీ.. వివాదం
అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. కరోనా సమయంలో ముందుండి.. రోగి ప్రాణాలను కాపాడే వైద్యులు, ముఖ్యంగా జూనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ మాత్రం ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. తమకు అధికారంలోకి రాగానే కల్పిస్తానని హామీ ఇచ్చిన ఆరోగ్య బీమా,ఎక్స్‌గ్రేషియా కల్పించాలని వారు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జగన్ సర్కారు మాత్రం వీటిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రంలోని జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెకు దిగనున్నారు.
ఏం జరుగుతోంది..
కరోనా బాధితులకు వైద్యం అందించేవారిలో కీలకమైన జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్.. జగన్ సర్కారు వైఖరిపై నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి…. నాన్ కొవిడ్ సేవలు బహిష్కరిస్తూ …కొవిడ్ విధులకు మాత్రమే హాజరుకానున్నారు. స్టైఫండ్ లో టీడీఎస్ కటింగ్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామంటున్న జూనియర్ వైద్యులు….ఈ నెల 10న కోవిడ్ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. 11 న నాన్ కోవిడ్ అత్యవసర విధుల బహిష్కరణ… 12 న కోవిడ్ విధుల అత్యవసరసేవల బహిష్కరణను నిర్వహిస్తామన్నారు.
ఇది అవమానం కాదా!
చాలా రాష్ట్రాల్లో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న జూనియర్ వైద్యులకు అక్కడి ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. మరి వైద్య రంగంలో పేరు గొప్పగా చెప్పుకొనే సీఎం జగన్‌కు ఇప్పుడు జూనియర్ డాక్టర్లు చేసిన ప్రకటన అవమానం కాదా? అనేది పరిశీలకుల ప్రశ్న. కాగా, డీఎంఈ, వైద్యశాఖమంత్రితో సమావేశమై సమస్యలపై చర్చిస్తామని జూడాల AP అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. మరోవైపు జూడాల సమ్మెకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.