కోర్టులు తమకు నచ్చని తీర్పులు ఇస్తున్నాయని ఆగ్రహంగా ఉన్న ఏపీ సర్కారు మోడీ అండతో ఏపీ ప్రధాన న్యాయమూర్తినే మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు సీపీఐ నేత నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
‘‘ఎన్నికల కమిషనర్ తమకు నచ్చలేదని తమకు లేని అధికారం ప్రయోగించి ఆయన్ను మార్చాలనుకున్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో అది ఆగిపోయింది. కానీ బరితెగించి ఇపుడు ఏపీ హైకోర్టు మీద పడ్డారు. తమకునచ్చని తీర్పులు రాలేదని న్యాయమూర్తినే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు’’ … అని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు గతంలో రైతుల భూమిని సొంతానికి తీసుకోలేదని, రాజధాని కోసం తీసుకున్నారని నారాయణ చెప్పారు. రైతుల పోరాటం సమంజసమైనది. వారి పోరాటంలో న్యాయం ఉంది. ఏనాడూ బయటికి రాని మహిళలు వీధుల్లోకొచ్చి పోలీసులతో దెబ్బలు తింటున్నారు. రౌడీలతో రాళ్లు వేయించుకుంటున్నారు. తిండీతిప్పలు లేకుండా, పండుగపబ్బాలు లేకుండా న్యాయం కోసం పోరాడుతున్నారు.. ఎంత బాధ లేకపోతే, ఎంత నష్టపోకపోతే వాళ్లు ఇంత తీవ్రంగా ఉద్యమం చేస్తారు? అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రాజ్యాంగ హక్కులు హరించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని నారాయణ ఆరోపించారు.
“రాజధానికి అడ్డం కొడుతుంటే కోర్టు ఆంక్షలు విధిస్తోంది. దాంతో వీళ్లు ఎన్నికల కమిషనర్నే కాదు, హైకోర్టు జడ్జిని కూడా తీసేద్దాం అనుకుంటున్నారు. తమకు నచ్చని జడ్జిని ట్రాన్స్ ఫర్ చేసేద్దాం అనుకుంటూ బరితెగించిన పద్ధతిలో ముందుకెళుతున్నారు. వీళ్లకు కేంద్రంలో కూడా మద్దతు ఉంది. ఎందుకంటే కేంద్రానికి ఓట్లు కావాలి, బలగం కావాలి కాబట్టి వీళ్లకు మద్దతిస్తున్నారు. దాంతో వీళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇక్కడో విషయం గమనించాలి… కోర్టులు జగన్ కు వ్యతిరేకం కాదు… జగన్ చేసే పనులకు మాత్రమే వ్యతిరేకం. తమకు నచ్చకపోయే సరికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లాగా హైకోర్టు జడ్జినే తీసిపారేద్దాం అనుకుంటున్నారు” అని వివరించారు. – Narayana, CPI