ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రేపటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్-6 గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా షోను రక్తికట్టించి మరో రేంజ్ కు తీసుకు వెళ్లాడు. తెలుగులో అంత సక్సెస్ అవుతుందో కాదో అనుకున్న ఆ షోను తారక్ ఒంటి చేత్తో డీల్ చేసి వ్యాఖ్యాతగానూ తాను తక్కువేం కాదని ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక, తారక్ నుంచి రెండో సీజన్ పగ్గాలను అందుకున్న నేచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో షోను లాగించేశాడు. ఇక, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తన చరిష్మాతో మూడు, నాలుగు, ఐదు సీజన్స్ ను అవలీలగా ముగించేసి బిగ్ బాస్ పై క్రేజ్ ను మరింత పెంచేశాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్-5కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునే ఆరో సీజన్ ను హోస్ట్ చేయబోతున్నారు.
సెప్టెంబరు 4వ తేదీ నుంచి బిగ్ బాస్-6 షురూ కాబోతుండడంతో ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. బిగ్ బాస్-6కి సంబంధించిన ప్రోమోలు ఆల్రెడీ ఆసక్తిని రేకెత్తించాయి. ఇక, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టేది వీరేనంటూ ఎన్నో లిస్ట్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్లలాగే సినీ, టీవీ, రేడియో జాకీ, యూట్యూబ్ స్టార్లను బిగ్ బాస్ హౌస్ లో బంధించబోతున్నారట.
దాదాపు 20 మంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే ఫైనల్ లిస్ట్ అని అంటున్నారు. బాలాదిత్య (నటుడు), నేహా చౌదరి (యాంకర్), చంటి (కమెడియన్), రోహిత్-మెరీనా దంపతులు, రేవంత్ (సింగర్), ఇనయా సుల్తానా, శ్రీహాన్, పింకీ (నటి సుదీప), శ్రీసత్య (బుల్లితెర నటి), గీతూ రాయల్, ఆర్జే సూర్య, ఆరోహీ రావ్ (యాంకర్), కీర్తి, ఫైమా (కమెడియన్), రాజశేఖర్, వసంతి (నటి), అర్జున్, ఆదిరెడ్డి, షాన్నీ…వీరంతా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ లిస్ట్ లో ఎంతమంది లోపలికి వెళతారన్నది తేలాలంటే రేపు షో మొదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. కాగా, ఈ జాబితాలో ఉన్న స్టార్ సింగర్ రేవంత్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తాను షోలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన రేవంత్…టైటిల్ కూడా తనదేనంటూ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.