ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలు చేయనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. అయితే.. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం దీనిలో కొన్ని సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది. డిసెంబరు-మార్చి మధ్య అమలు చేసే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. దీనిలో పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు రూ.15000 చొప్పున ఇచ్చే మాతృవందనం పధకానికి రూ.6485 కోట్లకుపైగానే ప్రకటించింది. అయితే.. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలు కూడా రావాల్సి ఉంది.
మరోవైపు.. రైతులకు సూపర్ సిక్స్‌లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకానికి కూడా.. ఈ బడ్జెట్లో నిధులు చూపించింది. రూ.1000 కోట్లను రైతులకు కేటాయించింది. మొత్తంగా ప్రస్తుతం ప్రకటించిన స్వల్ప కాలిక బడ్జెట్లోనే రెండు సూపర్ సిక్స్ పథకాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇక, మరో రెండు పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నారు. దీనిలో ఒకటి పింఛన్ల పెంపు కాగా, రెండోది.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం. ఈ రెండు పథకాలను కూడా ఇప్పటికే ప్రజలకు అందిస్తున్నారు. ఇక, మిగిలిన వాటిలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కీలకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
దీనికి సంబందించి కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనిలో భాగంగా ఈ ఏడాదిలోనే అంటే..నవబంరు-డిసెంబరు మధ్యలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్నిఅందించనున్నారు. ఈ మేరకు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, వైసీపీ ప్రభుత్వం అనేక అప్పులు చేసిందని దీంతో పథకాల అమలు ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనిఆయన వివరించారు. అయినప్పటికీ.. సీఎం చంద్రబాబు చాలా దూర దృష్టితో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు.