అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి వలసదారుల పాలిట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికాలో విద్య, ఉద్యోగం కోసం వచ్చిన పలు దేశాల వారికి వీసాలకు సంబంధించిన నిబంధనలను బైడెన్ సులభతరం చేశారు హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ పలు వివాదాస్పద ఆదేశాలివ్వడం, నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాను అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ఆదేశాలను రద్దుచేశారు. బైడెన్ నిర్ణయంతో హెచ్-1బీ వీసా వ్యవహారంలో పలువురికి ఊరట లభించింది.
గతంలో డిపెండెంట్ వీసాదారులకు బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికాలో డిపెండెంట్ వీసాలతో ఉంటున్న మహిళలకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్లు ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, కొద్దిరోజుల క్రితం భారీగా భారతీయులకు స్టూడెంట్ వీసాలను బైడెన్ సర్కారు జారీ చేయడం తెలిసిందే. ఈ రకంగా ట్రంప్ చేసిన కంపును కడిగిపారేస్తున్న బైడెన్ వలసదారులను సంతృప్తిపరచే నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలను టార్గెట్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డులకు సంబంధించి బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్ కార్డులు పొందేందుకు అర్హులని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనలు డిసెంబర్ 23 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీకి సంబంధించి పలు ఆంక్షలను విధించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫుడ్ స్టాంపులు, హౌసింగ్ వోచర్లు, మెడికల్ సాయం పొందిన వారికి గ్రీన్ కార్డులను గత ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు, వలసదారుల ఆదాయం, వయసు, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకునేది కాదు.
ఈ క్రమంలోనే తాజాగా వీటన్నింటినీ పక్కన పెట్టిన బైడెన్… గ్రీన్ కార్డుల జారీకీ వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. దీంతో, అమెరికాలో ఉంటున్న పలుదేశాల వలసదారులకు, ముఖ్యంగా ఎన్నారైలకు ఇది అతి పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. గ్రీన్ కార్డులపై బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నారైలతో పాటు అమెరికాలోని పలు దేశాల ప్రజలు స్వాగతిస్తున్నారు. తమపై వరాల జల్లు కురిపించిన బైడెన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.