అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనాతో అగ్రరాజ్యం సంబంధాలు ఏ రీతిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన సంక్షోభం అమెరికాను ఇప్పుడు ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే ట్రంప్ తన ఓటమిని ఒప్పుకునేందుకు నో అంటే నో అనేస్తున్నారు. న్యాయపోరాటం చేస్తూనే.. అధికార బదిలీకి ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్ ను తాము అధ్యక్షుడిగా గుర్తించమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడే వరకూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందన్నారు.
పుతిన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బైడెన్ కు ఇబ్బందికరంగామారింది. ఇలాంటివేళ.. కొత్త అధ్యక్షుల వారిపై చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించే జెంగ్ యాంగ్నియాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చైనా ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదు.. చైనాలోని ప్రముఖ అధ్యయన సంస్థకు డీన్ గా వ్యవహరిస్తుంటారు.
బైడెన్ బలహీన అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ఆయన హయాంలో చైనా – అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించలేమన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి మంచి రోజులన్ని గడిచిపోయినట్లుగా పేర్కొన్నారు. అయితే.. అమెరికాతో సఖ్యతగా ఉండేందుకు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనా వదులుకోకూడదని.. సరిగా వినియోగించుకోవాలన్నారు.
ఈయన నోటి నుంచి బైడెన్ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయటానికి కారణం లేకపోలేదు. అంతర్జాతీయ నిబంధనల్ని పాటించేలా చైనాపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బైడెన్ నాయకత్వ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు నెలల క్రితం చైనా అధినేత జీ జింగ్ పింగ్ తో జరిగిన సమాశేశానికి జెంగ్ హాజరయ్యారు. అమెరికా విషయంలో చైనా వ్యవహరించాల్సిన దీర్ఘకాలిక వ్యూహంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు చెబుతారు.
చైనాపై అమెరికాలోని అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
బైడెన్ కచ్ఛితంగా బలహీనమైన అధ్యక్షుడని.. దేశీయంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించలేని పక్షంతో దౌత్యపరంగా దూకుడుగా వ్యవహరించే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ట్రంప్ వ్యతిరేకిగా పలువురు అభివర్ణించినా.. యుద్ధాలు ప్రారంభం చేసేందుకు వెనుకాడే గుణం ఉందని.. ఈ తీరుకు బైడెన్ భిన్నమన్నారు. బైడెన్ ప్రజాస్వామ్యానికి అనుకూలురే అయినప్పటికి.. యుద్ధాలు ప్రారంభించే వీలుందన్నారు. జెంగ్ వ్యాఖ్యలు బైడెన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.