‘నిజం గెలవాలి’ యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం బిడ్డలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపడితే పుంగనూరులో వారు వేసుకున్న తెలుగు దేశం చొక్కా, జెండా చింపి కింద పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా..తెలుగు దేశం బిడ్డలు పైకి లేచి తెలుగుదేశం జెండా రెెపరెపలాడిస్తారని అన్నారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టినా ధైర్యంగా చేయి చేయి కలిపి ఈ పోరాటంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
లోకేష్ పాదయాత్రను అడ్డుకోలేక ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్టు చేసి మానసికంగా దెబ్బతీయాలనుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఆయనను ఏమీ చేయలేరని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో మన హక్కులు కాలరాస్తున్నారని, అడుగు వెనక్కు వేయకూడదని పిలుపునిచ్చారు. తెలుగు పౌరుషం అంటే ఏంటో వారికి చూపించాలని, రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారని అన్నారు. నిజం గెలవాలి. నిజమే గెలవాలి. సత్యమేవ జయతే అని నారా భువనేశ్వరి నినాదాలు చేయించారు.