టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. పోలవరం నిర్మించడం.. రాష్ట్రం కోసం అహర్నిశలూ కష్టపడి కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా పనిచేయడమేనా? అని నిలదీశారు. `నిజం గెలవాలి` పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తిరుపతి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో నారా భువనేశ్వరి ప్రసంగిస్తూ.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
“చంద్రబాబు చేసిన తప్పేంటి? పోలవరం కట్టడం, అనేక పరిశ్రమలు తేవటం, ఉద్యోగాలు తేవటం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టడమేనా? అదే..చంద్రబాబు చేసిన తప్పా?!“ అని భువనేశ్వరి నిలదీశారు. స్కిల్ డెవల్మెంట్ కార్పొరేషన్ గుజరాత్ లో కూడా ఉందని.. అక్కడి మోడల్‌నే ఏపీలో చంద్రబాబు అమలు చేశారని అక్కడ జరగని తప్పులు ఇక్కడెలా జరుగుతాయని ప్రశ్నించారు. ఒక్కపుడు ఏపీ అంటే అభివృద్ధి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, అక్రమ కేసులు, అన్నదాతల అత్మహత్యలు, అత్యాచారాలు, భూ దందాలు, కమిషన్ల కోసం బెదరించడమేనని నిప్పులు చెరిగారు.
రాజధాని లేని దిక్కు మొక్కు లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ సర్కారు మార్చేసిందని నారా భువనేశ్వరి దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే మంచి జరగదని, ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోందని చెప్పారు. రాజ్యాంగాన్ని అమలు పరిచేవారు మంచి వారైతే రాష్ట్రానికి, ప్రజలకు కూడా మంచి జరుగుతుందని అంబేద్కర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీది ధనబలం అయితే.. టీడీపీది ప్రజాబలమన్నారు. టీడీపీ జనసేనలకు అఖండ విజయం తధ్యమని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.