టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అరెస్టు బాధను తట్టుకోలేక పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు హఠాన్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులను ఓదార్చేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను ఈ రోజు మొదలుబెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనేశ్వరి ప్రవీణ్ రెడ్డి, చిన్నప్ప నాయుడుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చంద్రగిరికి బయలుదేరే ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి భువనేశ్వరి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు చనిపోయిన సమయంలో ఎంతో బాధగా ఉంటుందని, వారి కుటుంబ సభ్యులను కలిసి భరోసానివ్వడం తమ బాధ్యత అని భువనేశ్వరి అన్నారు. కార్యకర్తల మరణవార్త విన్న చంద్రబాబు తీవ్ర మనోవేదన చెందారని అన్నారు. జైల్లో ఉన్నా ఆయన ధ్యాసంతా ప్రజలపైనే ఉందన్నారు. కుటుంబం కంటే కార్యకర్తల గురించే చంద్రబాబు ఎక్కువగా ఆలోచిస్తుంటారని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, చిన్నప్పల మృతి బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, చిన్నప్పల కుటుంబ సభ్యులకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు.