ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు.. ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో నిజం గెలవాలి పేరుతో యాత్రల్ని నిర్వహిస్తున్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమానికి ‘నిజం గెలవాలి’ అన్న పేరును పెట్టేయటం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లు కాకుండా.. విసిగిపోని విధంగా భువనేశ్వరి ప్రసంగాలు ఉంటున్నాయి. అయితే.. రోజు రోజుకు ఆమె ప్రసంగాల్లో ఇంప్రూమెంట్ కనిపిస్తోందని చెప్పాలి. ప్రజల మనసులకు సూటిగా తాకేలా మాట్లాడే విషయంలో ఆమె తీరు అంతకంతకూ మెరుగవుతోంది.
చిట్టి పట్టుకోకుండా..మైకును పట్టుకొని మాట్లాడుతున్న ఆమె.. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. పార్టీకి చెందిన పలువురు నేతలు భువనేశ్వరిని ప్రశ్నలు వేయగా.. ఆమె వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి దేవాన్ష్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి స్పందించిన భువనేశ్వరి.. ‘తాత ఎక్కడ?’ అని దేవాన్ష్ అడుగుతున్నారని.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్ కు తెలీదు. చిన్న వయసు కావటంతో తనకు చెప్పదల్చుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్త ఒకరు స్పందిస్తూ.. ఇప్పుడున్న కష్టకాలాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అని ప్రశ్నించగా.. స్పందించిన భువనేశ్వరి.. ‘‘నా తండ్రి ఎన్టీఆర్ పౌరుషం నాలో ఉంది. చంద్రబాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన క్రమశిక్షణ.. ఓర్పు నేర్చుకున్నా. ఈ రెండు కలిసి నన్ను ముందుకు తీసుకెళతాయి’ అరి వ్యాఖ్యానించారు.
దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చంద్రబాబు లేఖ రాస్తే.. ప్రభుత్వం వేరే పని లేకుండా లేఖపై విచారణ చేస్తోందన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ కల్యాణ్ తమకు అండగా నిలిచారన్న భువనేశ్వరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు.. రైతులకు విద్యుత్తు.. సాగునీరు.. తాగునీరు ఎలా ఇవ్వాలన్న ఆలోచనలు చేయాలంటూ ప్రభుత్వానికి హితవు పలికారు.