టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం నియోజకవర్గంలోని గునుపూడిలో పాదయాత్ర సందర్భంగా 43 మంది వాలంటీర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తే…వాలంటీర్ల పై కేసులు పెట్టారు. దాదాపుగా నెల రోజులుగా జైల్లో ఉన్న వీరు ఈరోజు బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
వారందరినీ ఆత్మీయంగా పరామర్శించిన భువనేశ్వరి వారి సేవలను మర్చిపోలేమని కొనియాడారు. లోకేష్ తో ఉన్నారన్న కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాలంటీర్ల రుణం తీర్చుకోలేమని, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని లోకేష్ వెంట వాలంటీర్లు ఉన్నారని ప్రశంసించారు.
చేయని నేరానికి జైలుకు వెళ్లిన వాలంటీర్ల కష్టం, త్యాగం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని అన్నారు. వాలంటీర్లపై అక్రమ కేసులు ఎంతో బాధించాయని, జైలు నుంచి వారు విడుదలవుతున్నారని తెలియగానే వారిని కలవాలని అనుకున్నానని భువనేశ్వరి అన్నారు. వాలంటీర్ల అరెస్టుతో వారి తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో తాను కూడా అంతే బాధపడ్డాను అని భువనేశ్వరి అన్నారు.