పెను సంచలనంగా మారిన కిడ్నాప్ ఉదంతం నాటకీయ మలుపులు తిరగటం తెలిసిందే. దాదాపు రూ.400 కోట్లకు పైనే విలువ ఉన్న ఈ భూములకు సంబంధించిన వివాదంలో సీఎం కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు అండ్ కోను కిడ్నాప్ చేయించింది ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియనే అన్న విషయాన్ని పోలీసులు అనుమానించటం.. ఆమెనుఅరెస్టు చేసి రిమాండ్ పంపటం తెలిసిందే. అయితే.. ఇదే కేసులో మరో నిందితుడిగా పేర్కొన్న ఆమె భర్త భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్పటివరకు బయటకు రాలేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న అనంతరం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించటం.. అక్కడే మూడు గంటలకు పైనే విచారించటం తెలిసిందే. ఈ సందర్భంగా భర్త గురించి అడగ్గా.. ఆమె స్పష్టమైన సమాధానం చెప్పలేదంటున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుంటే.. ఈ మొత్తం ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే కిడ్నాప్ వ్యవహారంలో ఏ3గా ఉన్న భార్గవ్ రామ్ ఆచూకీ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అతను బెంగళూరులో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసుల టీం ఒకటి బెంగళూరుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు అయి.. రిమాండ్ లో ఉన్న భూమా అఖిలప్రియ తరఫున బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. న్యాయవాద వర్గాల అంచనా ప్రకారం.. ఈ కేసులో ఇప్పటికిప్పుడు బెయిల్ లభించే అవకాశం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కిడ్నాప్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటంతో.. వారి ఆచూకీ తెలిసే వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.