మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. తమపై పోలీసులు కక్ష సాధింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు. పోలీసుల వ్యవహారంపై కేసీయార్, కేటీయార్ కు లేఖలు కూడా రాశారు. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా అఖిల భర్త భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి పరారీలో ఉన్న నేపధ్యంలో అఖిల మీడియాతో మాట్లాడారు.
ఇంతకీ వాళ్ళిద్దరు ఎందుకు పరారీలో ఉన్నారంటే తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారనే ఆరోపణలపై పోలీసులు వాళ్ళిద్దరినీ విచారణకు రమ్మని నోటీసులిచ్చినందుకు. అప్పుడెప్పుడో ఓ భూ వివాదంలో భూమా ఫ్యామిలి ఇరుక్కున్న విషయం తెలిసిందే కదా. దానికి సంబంధించిన విచారణ కోసం పోలీసులు ఇపుడు రమ్మన్నారు.
అయితే విచారణకు హాజరు కాని బావా-బావమరుదులు తమకు కోవిడ్ సోకిందని, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేమని చెప్పారట. చెప్పటమే కాకుండా కోవిడ్ సోకినట్లు ల్యాబ్ రిపోర్టు కాపీ కూడా సబ్మిట్ చేశారట. అయితే వీరిచ్చిన రిపోర్టును క్రాస్ చెక్ చేసుకునేందుకు పోలీసులు సదరు ల్యాబ్ ను సంప్రదించారట.
పోలీసులిచ్చిన రిపోర్టును చూసిన ల్యాబ్ వాళ్ళు ఆశ్చర్యపోయారట. సదరు రిపోర్టు తామిచ్చింది కాదని స్పష్టంగా చెప్పారట. దాంతో బావా, బావమరుదులతో పాటు ల్యాబ్ పైన కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేపధ్యంలోనే విచారణకు రావాలంటు పోలీసులు కబురు చేయగానే ఇద్దరూ పారిపోయారని సమాచారం. అయితే అఖిల పై విషయాలను ఖండిస్తున్నారు. తమపై పోలీసులు కక్షసాధిస్తున్నట్లు మండిపడ్డారు. మొత్తానికి భూమా ఫ్యామిలీకి వివాదాల్లో కూరుకుపోవటంట మామూలైపోయింది.
దీనిపై భూమా అఖిల వర్షనేంటి?
వరుసగా కొన్ని రోజుల ప్రయాణాల వల్ల అనారోగ్యంగా ఉన్నందున కరోనా టెస్ట్ చేయించుకున్నారు.. టెస్ట్ చేయించుకున్న కొన్ని గంటలకే పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ కు రమ్మని ఇంటికి వచ్చారు. కరోనా టెస్టు కోసం సహకరించలేదని పోలీసులు అంటున్నారు. పోలీసుల మీద నమ్మకం లేక మేమే కరోనా టెస్టు చేయించుకుంటామని చెప్పాం. అలాగే చేయించుకున్నాం. ల్యాబ్ వాళ్లు మాకు ఒక రిపోర్టు, పోలీసులకు మరో రిపోర్టు ఎందుకిచ్చారో తెలియదు.
దీని వెనుక ఏవో కారణాలు ఉన్నాయి అన్నారు అఖిలప్రియ. ఆరా తీస్తే ల్యాబ్ వాళ్లను కొట్టి, హింసించారని మాకు సమాచారం ఉందన్న ఆమె.. మాపై వరుసగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని.. నా భర్తను ఐడెంటిఫికేషన్ కోసం రమ్మని కోర్టుకు పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కిడ్నాప్ ఘటనలో నా భర్త ఉంటే ఈ రోజు మళ్లీ ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకు రమ్మంటున్నారు ? అని ప్రశ్నించారు.