పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాము పవన్ సినిమాను టార్గెట్ చేయలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందరికీ ఉండే రూల్సే ఈ సినిమాకూ వర్తిస్తాయని, జీవో రావడలంలో కొద్దిగా ఆలస్యమైందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా స్పందించారు. మరో నాలుగు రోజులు ఆగి సినిమా విడుదల చేయాల్సిందని, తొందరపడి రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని నిందించడం ఏమిటని కొత్త పాయింట్ ను తెరపైకి తెచ్చారు తమ్మినేని.
సినిమా బాగుంటే ఆడుతుందని, బాగా లేకపోతే ఫ్లాప్ అవుతుందని కొత్త భాష్యం చెప్పారు. ‘అఖండ’, ‘డీజే టిల్లు’ సినిమాలు బాగా ఆడాయని, పవన్ కల్యాణ్ అయినా, అకీరానందన్ అయినా తమకు ఒకటేనని తమ్మినేని సెలవిచ్చారు. మరో 4 రోజులు ఆగి ఉంటే కొత్త జీవో వచ్చేదని, అదనపు షోలు, కొత్త టికెట్ రేట్లు వచ్చేవని చెప్పారు. పవన్ ప్రత్యేకంగా ఏదైనా చేయడం తమ ప్రభుత్వానికి సాధ్యం కాదని చెప్పుకొచ్చారు తమ్మినేని.
ఇవి చాలదన్నట్లుగా భీమ్లా నాయక్ సినిమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం తమ కులస్థులను కించపరిచేలా ఉందని పోలీసులకు కుమ్మరి కులస్థుల సంఘం ఫిర్యాదు చేసింది. తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని ఓ సన్నివేశంలో రానా కాలితో తన్నారని, అది కుమ్మరులను కించపరిచే విధంగా ఆ సంఘం నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ సన్నివేశాలను తొలగించాలని తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఏపీలోని గుంటూరు జిల్లా ఎస్పీకి ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పోరేషన్ ఛైర్మెన్ ఎం పురుషోత్తం కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. మరి, ఈ వివాదంపై చిత్ర దర్శకనిర్మాతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.