తెలుగువారికి సంక్రాంతి అనేది ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఓ వైపు కొత్త అల్లుళ్లు…మరోవైపు కొత్త సినిమాలు….ఇంకో వైపు కోడిపందేలు…ఇవన్నీ కలిసి సంక్రాంతి పండుగను ఎంతో ప్రత్యేకమైనవిగా నిలిపాయి. అందుకే, సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేయాలని చాలామంది టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. ఇక, మరికొందరు హీరోలకైతే సంక్రాంతికి సినిమా రిలీజైతే హిట్ అని సెంటిమెంట్ ఉంటుంది.
అందుకే, సంక్రాంతి బరిలో తమ సినిమాను నిలిపేందుకు చాలా రోజుల ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాబోయే సంక్రాంతి సందర్భంగా నాలుగు భారీ సినిమాలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో మరో నాలుగు పెద్ద హీరోల చిత్రాలు బరిలో ఉండడంతో హోరాహోరీ పోరు తప్పదని అంతా భావించారు. కానీ, అనూహ్య రీతిలో సంక్రాంతి బరిలో నుంచి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్3 చిత్రాలు తప్పుకున్నాయి. దీంతో, ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 7న ఆర్ఆర్ఆర్, జనవరి 14న రాధే శ్యామ్ విడుదల కానున్నాయి.
ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నిర్మాత దిల్ రాజులకు దర్శకుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. సర్కారు వారి పాట ఈ పొంగల్ సీజన్ లో తప్పక విడుదల అవ్వాల్సిన సినిమా అని, కానీ, సంక్రాంతి సినిమాల విడుదలలో గందరగోళం ఉండకూదన్న ఉద్దేశ్యంతో మహేశ్ బాబు ఎంతో సుహృద్భావపూరితమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
భీమ్లా నాయక్ విషయంలో చినబాబు గారు, పవన్ కల్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గదని చెప్పారు. భీమ్లా నాయక్ చిత్రబృందానికి జక్కన్న ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎఫ్3 సినిమా విడుదల తేదీని మార్చుకున్నందుకు దిల్ రాజు గారికి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి.
‘ఆర్ ఆర్ ఆర్’ .. ‘రాధేశ్యామ్’ సినిమాలను మొదలుపెట్టేసి మూడేళ్లు కావడం, ఆ రెండూ పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు అదే రోజున హిందీ తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ రెండు చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో స్క్రీన్లు కావాల్సి ఉంటుంది. దీంతో, భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25వ తేదీకి, అదే రోజు విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ ను ఏప్రిల్ 29కి మార్చారు.