హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ లో మంటలు మండిస్తోంది. మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కేసీయార్ బర్తరఫ్ చేయటంతో టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా ఈటల రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసిన ఈటల ఎంఎల్ఏ హోదాలోనే కాంగ్రెస్, బీజేపీతో నేతలతో పాటు అనేకమందిని వ్యక్తిగతంగా కలిశారు. కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత బట్టీ విక్రమార్కతో పాటు అనేకమందితో భేటీ అయ్యారు. దాంతో ఈటల కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తు ఈటల కమలనాదులతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి పోటీచేసి గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మినిమం ఓటుబ్యాంకుంది. ఓడిపోయిన ఎన్నికల్లో కూడా తక్కువలో తక్కవ 30 వేలకు తగ్గకుండానే ఓట్లు సంపాదించుకుంది. అంటే ఎంత కనాకష్టంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో 30 వేల ఓట్లున్నాయన్నది వాస్తవం. అలాంటిది మొన్నటి ఉపఎన్నికల్లో వచ్చింది కేవలం 3 వేలు మాత్రమే. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకుంది.
ఈ నేపధ్యంలోనే అధిష్టానం నుండి సీనియర్ నేతలందరికీ పిలుపొచ్చింది. శనివారం మధ్యాహ్నం అధిష్టానంతో భేటీ సందర్భంగా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. అయితే ఈ మొత్తంలో బయటపడిందేమంటే కాంగ్రెస్ లో ఈటల చేరుదామని అనుకుంటే బట్టి విక్రమార్కే అడ్డుకున్నారట. బట్టీ మాట్లాడుతు ఈటలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునుంటే బాగుండేదన్నారు. ఈటల కాంగ్రెస్ లో చేరకుండా కొందరు అడ్డుకున్నారంటు బట్టి ఆరోపణలు చేశారు.
దాంతో అక్కడే ఉన్న ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ బట్టిఫై ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. ‘అప్పట్లో ఈటలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని నువ్వే చెప్పి ఇపుడు ఇతరులపై నిందలు వేయటం ఏమిటం’టూ మండిపోయారు. నిజానికి ఈటల గనుక కాంగ్రెస్ లో చేరుంటే ఇంకా ఎక్కువ మెజారిటితో గెలిచుండేవారే. ఈటల కాంగ్రెస్ లో చేరితే పార్టీకి మంచి ఊపొస్తుందనే అందరు అనుకున్నారు. కానీ ఈటల మాత్రం బీజేపీలో చేరారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిందనే ప్రచారం కూడా జరిగింది.
అయితే కాంగ్రెస్ లో ఈటల ఎందుకు చేరలేదు ? ఈటల చేరకుండా అడ్డుపడిందెవరు ? అన్న విషయంలో ఎవరికీ క్లారిటి రాలేదు. అయితే తాజాగా జరిగిన భేటీలో కేసీ వేణుగోపాల్ చేసిన కామెంట్ తో విషయం బయటపడిపోయింది. ఈటల కాంగ్రెస్ లో చేరకుండా బట్టీనే అడ్డుకున్నారన్న విషయం వేణుగోపాల్ స్పష్టంగా చెప్పేశారు. అంటే పార్టీ గెలుపును బట్టీనే స్వయంగా అడ్డుకున్నారనే విషయం ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. అయితే ఈటలను బట్టి ఎందుకు అడ్డుకున్నారన్న విషయం మాత్రం సస్పెన్సుగానే ఉండిపోయింది.