మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చాలా కాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు అరెస్టు చేయడం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. గూగుల్ టేఔట్ ఆధారంగా వివేకా మర్డర్ జరిగిన రోజు భాస్కర్ రెడ్డి ఇంట్లో నిందితులు ఉన్నారని గుర్తించింది.
ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలులో రిమాండ్ పై ఉంచారు. అయితే, అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే భాస్కర రెడ్డిడి పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు.
ఏప్రిల్ 16వ తేదీన భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్కర రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందు అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు ముందు రోజు భాస్కర రెడ్డి నివాసంలో ఉదయ్ కుమార్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించారు. ఈ క్రమంలో భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై కూడా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.