కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది నెలల క్రితం చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ యాత్ర తర్వాతే వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ వార్డులోకి మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి పూర్తిగా కోలుకునేందుకు రాహుల్ గాంధీ త్వరలోనే ‘భారత్ న్యాయ యాత్ర’ చేపట్టబోతున్నారు.
మణిపూర్ నుంచి ముంబై వరకు జరగబోయే యాత్ర షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జరగబోతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేయబోతున్నారని కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 14 రాష్ట్రాలలోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేసేలాగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.
ఆయా ప్రాంతాలలో ప్రజల కష్టాలను రాహుల్ గాంధీ స్వయంగా తెలుసుకుంటూ ముందుకు సాగబోతున్నారు. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేయాలన్న కాన్సెప్ట్ తో సిడబ్ల్యుసి మీటింగ్ లో చర్చించి ఈ యాత్రను రూపొందించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 6200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర జరగబోతుంది.