మార్చి 23, 1931న భగత్‌సింగ్ సగర్వంగా ఉరికంబమెక్కాడు. తనను ఉరి తీసే ఆఖరి క్షణాల్లో కన్నతండ్రికి షహీద్ భగత్‌సింగ్ రాసిన చిట్టచివరి లేఖ ఇది.
89ఏండ్ల క్రితం రాసిన ఈ ఉత్తరాన్ని సమకాలీన పరిస్థితులకు పోల్చి విషయాలు విశ్లేషించుకోవాల్సి ఉంది.
నాటి అమరవీరుల త్యాగాల ముందు నేటి పాలకులు ఎక్కడ ఉన్నారో బేరీజు వేసుకోవాల్సి ఉంది. అంతేకాదు, సామాన్య పౌరులుగా మనం ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంది.
”పూజ్యులైన నాన్నగారికి,
నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో కానీ, ఈ దేశ పౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను.
మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను.
కానీ, మీకన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా?
నేను బ్రిటీషర్లపై చేసిన దాడిని నేరంగా భావించడం లేదు.
అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు.
నాన్నగారూ! నా జీవితం మనదేశం కన్నా విలువైనదేమీ కాదు.
అసలు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణ చేయాలని నమ్ముతాను కూడా.
అందుకు ఎన్ని ప్రతిఘటనలైనా ఎదురుకోవాలి.
అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా, కాలం చెల్లిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి.
నాకు తెలుసు. నా మెడకు ఉరితాడు బిగుసుకోవడమే నాకు ఆఖరిక్షణం కాగలదని.. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని, దయనీయం కాదు.
ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను.
మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది.
నాన్నగారూ! నా మరణానంతరం ముందు తరాలకు త్యాగమనే సుగుణం – తీగలా సాగి, పాకిపోయేలా చూడండి.
ఎలాంటి పరిక్షా సమయంలోనైనా, మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీయకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి. ఇక సెలవు..
ఇట్లు..
మీ ప్రియ పుత్రుడు భగత్‌సింగ్.”