మీ చిన్నారులు పుట్టుకతోనే ఆటిజంతో ఇబ్బందులు పడుతున్నారా? దేనినీ గుర్తు పట్టలేకపోతున్నారా? మాటలు రావడం లేదా? నోటి నుంచి చొంగ కారుస్తూ.. మానసికస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారా? కళ్లముందే కడుపున పుట్టిన పిల్లలు ఇలా ఇబ్బందులు పడుతుంటే ఏతల్లీ, ఏతండ్రీ ఓర్చుకోలేరు. ఎందుకంటే రక్తబంధం.. పేగు బంధం అలాంటిది. సో.. వారిని వెంటనే చికిత్సకు తీసుకువెళ్లి మెరుగైన చికిత్స అందించాలని.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని కూడా మీరు డిసైడ్ అవుతారు. ఇక్కడే ఒక్క క్షణం ఆలోచించండి. మీకు తెలిసిన వారి ద్వారా లేదా.. ఆన్లైన్లోనూ అసలు విషయాలు తెలుసుకోండి.
ఆటిజం థెరపీ విషయంలో ఏ సంస్థను నమ్మొచ్చు? ఏ సంస్థకు ప్రబుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి..? ఏసంస్థ ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయింది? ఏ సంస్థకు అనుభవం ఉంది? ఇప్పటి వరకు ఎంత మంది చిన్నారుల జీవితాల్లో ఆయా సంస్థలు వెలుగు పూలు పూయించాయి? వంటి అంశాలను పక్కాగా తెలుసుకోండి. అంతే తప్ప.. ఆఫర్లు ఇస్తున్నారనో.. లేదా ఇంటి పక్కనే ఉందనో.. లేక ఎవరో చెప్పారనో.. కనుక పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆటిజం కేంద్రాల్లో చేర్పిస్తే.. జేబులు ఖాళీ కావడం తప్ప.. చిన్నారుల మానసిక సమస్యల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ పోలీసులే చెబుతున్నారు.
ఏం జరిగిందిజజ?ఆటిజం సమస్యతో అల్లాడే చిన్నారులకు నేరుగా మందులు లేవు. కేవలం థెరపీ ద్వారా వారికి ఓర్పుగా, ఓపికగా చికిత్స అందించి.. గుణాత్మకమైన మార్పునకు నాంది పలకాలి. ఈ విషయంలో కొంత ఖర్చవుతుంది. తమ కడుపున పుట్టిన బిడ్డలను నయం చేసుకునేందుకు తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడరు. ఎంతైనా భరించేందుకు రెడీ అంటారు. ఇదే.. అక్రమార్కులకు వరంగా మారి.. రోడ్డుకొక ఆటిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను బురడీ కొట్టించి లక్షల రూపాయలు వెను కేసుకుంటున్నారు. ఇలాంటి కేంద్రాలపై తాజాగా హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి.. పోలీసులు ఆయా కేంద్రాలపై దాడులు చేసి.. నకిలీ ఆటిజం కేంద్రాలకు తాళాలు వేసి.. నిర్వాహకులను అరెస్టు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్లోని కూకట్ పల్లి, బీకే గూడ, సుచిత్ర, దిల్షుక్ నగర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పోలీసులు జరిపిన దాడుల్లో ఇలాంటి అక్రమ ఆటిజం కేంద్రాల గుట్టు రట్టయింది. సో.. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆటిజం కేంద్రాల్లో చేర్పించేప్పుడు.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.