తమిళనాడుకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరులోని స్పెషల్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని సీబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అటు నటనలోనూ, ఇటు నాట్యంలోనూ తనదైన ముద్ర వేసిన జయలలిత.. ఎం.జీ.ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు.
ఎడిఎంకె పార్టీలో కీలకంగా వ్యవహరించిన జయలలిత.. 1991లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించారు. 2014 సెప్టెంబర్ లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న కేసులో జయలలిత మరియు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి అరెస్ట్ అయ్యారు. బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయస్థానం వారికి నాలుగేళ్లు జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించడంతో.. జయలలిత ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి సీఎం జయలలితనే.
2015న అవినీతి కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా తేల్చి విడిచిపెట్టడంతో.. ఆమె మరలా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. 2016లో అనూహ్యంగా జయలలిత మరణించారు. దాంతో ఆమెపై విచారణ నిలిపివేసినప్పటికీ.. జయలలిత ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక జయలలితపై కేసు కొట్టివేయబడినందున ఆమె ఆస్తులను జప్తు చేయరాదని, అవి తమకే చెందుతాయని జయలలిత మేనకోడలు జే. దీప, మేనల్లుడు జే. దీపక్ కోర్టును ఆశ్రయించారు.
2023 జూలైలో సీబీఐ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించడంతో.. జే. దీప, జే. దీపక్ హైకోర్టులో అప్పీల్‌ను దాఖలు చేశారు. జనవరి 13న హైకోర్టు కూడా వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఇతర నిందితులను దోషిగా ప్రత్యేక కోర్టు నిర్ధారించడంతో.. ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బెంగళూరు స్పెషల్ కోర్టు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక పరిధిలో ఉన్న 1,562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, 10వేల చీరలు, 750 జతల చెప్పులు, వాచ్‌లు మరియు ఇతర వస్తువులను అధికారులు తమళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ తీర్పు ఇచ్చారు. ఇకపోతే తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో అంటే సుమారు పదేళ్ల క్రితం జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ. 913 కోట్లు ఉండగా.. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ. 4వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.