అవును! ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విశ్వసనీయతపై మేఘాలు ముసురుకుంటున్నాయనే అంటు న్నారు బీసీ వర్గాలకు చెందిన మేధావులు. బీసీలకు ఎన్నడూ లేనన్ని.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇవ్వనన్ని పదవులు తానే ఇచ్చానని.. 132 కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశానని.. ఘనంగా ప్రకటించుకుని పది రోజులు కూడా కాకముందే… బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడ్డాయి. నిజానికి బీసీల అసంతృప్తి ఈనాటిది కాదు. ఎప్పుడు ఏ సర్కారు ఉన్నప్పటికీ.. బీసీలు తమకు రాజ్యాధికారం దక్కడం లేదనే వాదనను తెరమీదికి తెస్తూనే ఉన్నారు.
అయితే, బీసీల నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఇకపై వినిపించబోవేమో.. మేం 132 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాధికారంలో వారిని పాత్రధారులను చేశాం.. కాబట్టి.. ఇక.. బీసీ సామాజిక వర్గాలకు అన్ని విధాలా మేళ్లు జరిగిపోయాయని.. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు ఘనంగా ప్రకటించారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేసిన మంత్రి వేణు.. కార్పొరేషన్లకు చైర్మన్ల జాబితాను ప్రకటించడాన్ని గత జన్మ పుణ్యంగా చెప్పుకొచ్చారు. దీనిని విన్న, కన్న వారంతా.. కూడా నిజమేనేమో.. ఇక, బీసీలకు జగనన్న హయాంలో అంతా మేళ్లు జరిగిపోతాయేమో.. అనుకున్నారు.
కానీ, పట్టుమని పది రోజులు కూడా తిరగకముందే.. కార్పొరేషన్ల ఏర్పాటు వెనుక లొసుగులు.. లోపాలు.. వ్యూహాలు బహిర్గతం అయ్యాయి. ఎక్కడికక్కడ వైసీపీ రాజకీయ అజెండా తప్ప.. నిజమైన బీసీల లబ్ధి ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలే.. తాజాగా మళ్లీ బీసీలకు రాజ్యాధికారం దిశగా ఆ వర్గాలను నడిపించేలా చేసింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులు.. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ ప్రసాద్ సహా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు వంటి వారు హాజరై.. బీసీలకు జగన్ సర్కారు పెట్టిన టోపీ.. దానివెనుక ఉన్న వ్యూహాలను కళ్లకు కట్టారు.
“కార్పొరేషన్ల ఏర్పాటుతో మాకు ఏదో న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఇక, బీసీల తలరాత కూడా మారుతుందని భావించాం. కానీ, అంతా డొల్ల. తన వారికి. తన పార్టీ వారికి పదవులు ఇచ్చుకునే క్రమంలో జగన్ వేసిన ఎత్తుగడగానే ఉంది. ఇది రాజ్యాధికారం కాదు.. బానిసత్వాన్ని ప్రోత్సహించడమే అని కార్యక్రమంలో పేర్కొనడాన్ని బట్టి.. జగన్ విశ్వసనీయత పెను పరీక్షకు గురైందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, త్వరలోనే తాముబీసీల పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా.. మరింతగా వేడి రగిలించారు. దీనికి తెలంగాణ బీసీ ఐక్య వేదిక కూడా కలిసిరావడం.. ఏపీలో మున్ముందు.. బీసీల విషయంలో జగన్ అనుసరించబోయే వ్యూహం.. వంటివి.. మరింత ఆసక్తిగా మారాయి. ఏదేమైనా.. ఇప్పుడు బీసీల విషయంలో జగన్ కు పరీక్షా కాలమేనని చెప్పకతప్పదని అంటున్నారు పరిశీలకులు.