ఐపీఎల్…ప్రపంచ క్రికెట్ లోని టీ20 లీగ్ లలో అత్యంత ప్రజాదరణ, అత్యంత రిచెస్ట్, క్రేజియస్ట్ క్రికెట్ లీగ్. లలిత్ మోడీ మానస పుత్రికగా ప్రపంచానికి పరిచయమైన ఐపీఎల్ ఇంతింతై వటుడింతై అన్నరీతిలో వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎదిగింది. బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు చేయడంలో ఐపీఎల్ దే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే తాజాగా టీ10 లీగ్ ను కూడా ఇండియాలో ప్రారంబించాలని బీసీసీఐ యోచిస్తోంది.
బీసీసీఐ సెక్రటరీ జై షా టీ10 టోర్నీని ప్రతిపాదించగా మిగతా సభ్యులు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ బ్లూ ప్రింట్ సిద్ధం చేసే పనిలో షా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో టోర్నీని ప్రారంభించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అబుదాబీ టీ10 లీగ్, కరీబియన్ టీ 10 లీగ్ లలో పొలార్డ్, గేల్ వంటి టీ 20 స్పెషలిస్టులు ఈ టోర్నీలలో ఆడారు.
ద్వైపాక్షిక సిరీస్ ల వల్ల క్రికెట్ బోర్డులకు పెద్దగా ఆదాయాలు రాకపోవడంతో ఈ తరహా సిరీస్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. అయితే, టీ20ల వల్ల వన్డే క్రికెట్ కు వన్నె తగ్గుతున్న నేపథ్యంలో టీ10లను ప్రోత్సహించడంపై క్రీడా పండితులు పెదవి విరుస్తున్నారు.