విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను వైసీపీ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అక్కడ జనవాణి నిర్వహించాలని వచ్చిన పవన్ ను నోవాటెల్ హోటల్ కే పరిమితం చేసిన పోలీసులు…అక్కడ నుంచి 24 గంటల్లో వెళ్లిపోవాలని కూడా హుకుం జారీ చేశారు. ఇలా జనసేనానిని, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా పవన్ కల్యాన్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీసీ సంఘం ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.
రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో తాము చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారని జాతీయ బీసీ సంఘం ఆరోపించింది. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. విశాఖ ఘటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ తోపాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ఫిర్యాదులో కమిషన్ ను కోరామని చెప్పారు. తమ ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని ఆయన తెలిపారు. అయితే, జనసేన అధినేత పవన్ ను ఇబ్బంది పెట్టి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో తాజాగా పవన్ పై ఈ ఫిర్యాదు వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి, ఆ ఫిర్యాదు నేపథ్యంలో పవన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.