బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నది. బెంగుళూరు శివారు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు రూ.30 నుండి 50 లక్షల వ్యయంతో ప్లాన్ చేసిన రేవ్ పార్టీని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు.
పోలీసులు దాడులలో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు. జీఆర్ ఫామ్ హౌస్ అంటే కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందినదిగా చెబుతున్నారు.
హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు సంధర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారని, ఆయన ఎవరు ? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు ? అని అతని వివరాల సేకరణలో పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇందులో వీఐపీలు, టాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న బెంజ్ కారు అక్కడ కనిపించడం కలకలం రేపింది. అయితే దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇక కన్నడ నటి హేమ ఉన్నట్లు అక్కడ ప్రచారం జరగగా తాను హైదరాబాద్ లో ఉన్నానని, ఆ పార్టీతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ ఈ పార్టీ పూర్తి వివరాలు వెల్లడికావు.