ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు…మరెన్నో వింతలువిశేషాలు. అంతరిక్షంలో మానవ మేధస్సుకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు…మరెన్నో జీవరాశులు. అందుకే, అంతరిక్షంలో అడుగుపెట్టాలని చాలామంది కలలు కంటుంటారు. అంతరిక్షాన్ని అన్వేషించాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే, అది అంత సులభం కాదు. అంత అదృష్టం అందరికీ ఉండదు. అంతరిక్షంలో పర్యాటకులను తీసుకువెళ్లేందుకు టెస్లా సహా పలు ప్రైవేటు సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మన తెలుగమ్మాయి ఆ అరుదైన అదృష్టం దక్కింది.
తెలుగు మూలాలున్న ఓ యువతి అంతరిక్షంలో అడుగుపెట్టబోతోన్న తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించబోతోంంది. జూలై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రయోగించనున్న అంతరిక్ష వాహక నౌకలో ఆంధ్రా అమ్మాయి బండ్ల శిరీష కూడా ప్రయాణించబోతోంది. ఈ వాహక నౌకలో అంతరిక్షంలో షికారు చేయడానికి వెళుతోన్న ప్రయాణికులలో భారత సంతతికి చెందిన శిరీష ఒకరు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ ప్రయోగం చేస్తోంది. జులై 11న న్యూ మెక్సికో నుంచి బయల్దేరే స్పేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులతో పాటు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్ సహా మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షయానం చేయబోతున్నారు. వారిలో వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న శిరీష బండ్ల కూడా ఒకరు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించన శిరీష బండ్ల…అనంతరం కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వాషింగ్టన్లో నివసిస్తున్న శిరీష…జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కమర్షియల్ స్పెస్ఫ్లైట్ ఫెడరేషన్‌లోని స్పెస్ పాలసీ డిపార్ట్మెంట్లో పని చేశారు. అంతరిక్షంలో అడుగుపెట్టాలని చిన్ననాటి నుంచే కలలు కన్నానని, ఆ కల ఇన్నాళ్లకు సాకారాం కాబోతోన్నందుకు ఆనందంగా ఉందని శిరీష హర్షం వ్యక్తం చేశారు.