సినిమాలు చేయని చేయకపోనీ ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే చూస్తాడు బండ్ల గణేష్. ఒక దశలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా కొన్నేళ్ల పాటు హవా నడిపించిన బండ్ల..వరుసగా కొన్ని చిత్రాలు తేడా కొట్టడంతో ప్రొడక్షన్ ఆపేశాడు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రాజకీయాల్లో హడావుడి చేసి అక్కడా ఎదురు దెబ్బ తగలడంతో బయటికి వచ్చేశాడు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియా ద్వారా తన పేరు జనాల నోళ్లలో నానుతూ ఉండేలా చేసుకుంటున్నాడు. ట్విట్టర్లో అప్పుడప్పుడూ బండ్ల గణేష్ పెట్టే ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అందులో కొన్ని ట్వీట్లు కేవలం జనాల దృష్టిని ఆకర్షించడానికి.. ఒక డిస్కషన్ జరగడానికి ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు అనిపిస్తాయి. ‘‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం.
దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం. లేకపోతే టైం వేస్ట్’’ అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ తనకు సినిమా ఇవ్వట్లేదన్న అసంతృప్తితో ట్వీట్ వేసినట్లే వేసి.. తనకా ఉద్దేశమేమీ లేదని బండ్ల సింపుల్‌గా తేల్చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా బండ్ల గణేష్ మరో వివాదాస్పద ట్వీట్ వేశాడు. తన తండ్రికి క్షవరం చేస్తున్న ఫొటో ఒకటి.. అలాగే విజయ్ దేవరకొండ తన ఇంటి మేడ మీద కూర్చున్న ఫొటో ఒకటి పక్క పక్కన పెట్టి ‘‘మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టం కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు. వారిని ప్రేమించడం పూజించడం మన ధర్మం’’ అని క్యాప్షన్ పెట్టాడు బండ్ల. ఐతే ఇందులో విజయ్, అతడి తండ్రి ఫొటోను ఎందుకు ఇరికించాడన్నదే బండ్ల ఫాలోవర్లకు అర్థం కాలేదు.
ఆ ఫొటోలో విజయ్.. తన తండ్రి ముందు కాలు పైకెత్తి కూర్చున్నాడు. బండ్ల గణేష్ తన తండ్రితో దిగిన ఫొటోతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. విజయ్ కాలు అలా లేపి పెట్టడంతో తనలా తండ్రిని గౌరవించట్లేదని బండ్ల కౌంటర్ వేస్తూ ఈ ఫొటో పెట్టాడని చాలామంది అనుకున్నారు. కామెంట్లలో దీని గురించి స్పందించారు. కొందరు విజయ్‌ని తిడితే.. తండ్రితో క్యాజువల్‌గా, ఫ్రెండ్లీగా ఉండడంలో తప్పేముంది అంటూ బండ్లకు క్లాస్ పీకారు. విజయ్ అభిమానుల నుంచి నెగెటివ్ కామెంట్లు పెరిగిపోవడంతో గంట తర్వాత బండ్ల ‘‘తల్లిదండ్రులను గుర్తుంచుకున్నందుకు, ఈ ఫొటోను పంచుకున్నందుకు థ్యాంక్స్ ’’ అంటూ ట్విస్ట్ ఇచ్చి సైలెంటైపోయాడు. ఇదంతా చూసి ఏంటి ఈ బండ్ల గణేష్ బాధ అంటూ ట్విట్టర్ జనాలు కౌంటర్లు వేస్తున్నారు.