వైసీపీ నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయం అక్కర్లేదు. కొడాలి నానిని ప్రతిపక్ష నేతలు ,కార్యకర్తలు బూతుల మంత్రి అని విమర్శలు గుప్పిస్తుంటారు. సమయం, సందర్భం ఏదైనా సరే టాపిక్ ఏదైనా సరే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై బూతులతో విరుచుకుపడడమే కొడాలి నాని ఎజెండా అని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.
కొడాలి నాని వాడే భాషపై టీడీపీ నేతలే కాకుండా జనసేన, ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయినా, సరే ఎంత బూతులు తిడితే జగన్ దగ్గర అంత మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కొడాలి నాని అసభ్యకరమైన పదాలతో ఎన్నోసార్లు మీడియా ముందు బహిరంగంగా చంద్రబాబు, లోకేష్ లను విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నాని పై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని వాడే భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, ఆ భాష బాగుందో లేదో తన భార్యా పిల్లలను అడిగి కొడాలి నాని తెలుసుకోవాలని బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు కూడా కొడాలి నాని వయసున్న కూతుర్లు ఉన్నారని అయితే ఇటువంటి అసభ్యకరమైన భాష మాట్లాడం, బూతులు మాట్లాడడంపై తన కూతుళ్లను కొడాలి నాని ఒకసారి అడగాలని, అది కరెక్టో కాదో చెప్పాల్సిందిగా వారి అభిప్రాయం తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలకు విమర్శలు గుప్పించడం సహజమని, కానీ, ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, బూతులు మాట్లాడడం సరికాదని బండ్ల గణేష్ అన్నారు. కొడాలి నానికి రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబు అని, నందమూరి హరికృష్ణ గారి పుణ్యమా అంటూ కొడాలి నాని టీడీపీలోకి వచ్చారని బండ్ల గణేష్ గుర్తు చేశారు. అంతేకాదు, కాలం కర్మం అదృష్టం కలిసి వచ్చి కొడాలి నాని మంత్రి అయ్యారని అన్నారు.
టీడీపీలో నుంచి వైసీపీలోకి కొడాలి నాని వెళ్లాలనుకున్నారని, దాంట్లో తప్పు లేదని అన్నారు. కానీ, పదే పదే తాను గతంలో పనిచేసిన టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం సరికాదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న ఫలానా సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేయడానికి వైసీపీలోని అదే సామాజిక వర్గానికి చెందిన నేతలను వాడుకుంటోన్న ట్రెండ్ సరికాదని బండ్ల గణేష్ అన్నారు.