టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై.. మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన తీరు బండ్ల గణేశ్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో? విషయం ఏదైనా సరే.. మాట్లాడే బండ్ల గణేశ్.. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఉండే టాలెంట్ ఆయన సొంతం. ఆ మధ్యన రాజకీయాల్లోకి రావటం.. ఎన్నికల్లో పోటీ చేస్తానని హడావుడి చేయటం.. చివర్లో రాజకీయాలు వద్దంటూ తన దారిన తాను వెళ్లిపోవంటం తెలిసిందే.
మొన్నటికి మొన్న ‘మా’ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి.. చివర్లో వెనక్కి తగ్గటం తెలిసిందే. ఎప్పుడేం చేస్తారో? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ మాత్రం అర్థం కానట్లుగా వ్యవహరించటంలో బండ్ల తర్వాతే ఎవరైనా. తాజాగా ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
షాద్ నగర్ లో జరిగిన ఈ ప్రైవేటు ఫంక్షన్ కు సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణలో బండ్లను రాజకీయాల్లోకి రావాలని.. రీఎంట్రీ ఇవ్వాలని కోరారు.
దీనికి స్పందించిన బండ్ల గణేశ్.. అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ తనను రాజకీయాల్లోకి రావాలని ఆదేశిస్తే తప్పకుండా వస్తానని చెప్పారు.
నిజంగానే రేవంత్ మాట కోసమే బండ్ల ఎదురు చూస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి.. టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేయటం కోసం అందరి ఇళ్లకు వెళ్లటం.. పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని కోరటం తెలిసిందే. నిన్నటికి నిన్న డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయనతో భేటీ కావటం.. పార్టీలోకి రావాలని కోరటం తెలిసిందే.
మరి.. బండ్ల నోరు తెరిచి అడిగిన నేపథ్యంలో ఆయన్ను పార్టీలోకి రమ్మని రేవంత్ అడుగుతారా? అన్నది ప్రశ్నగా మారింది. అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే బండ్ల గణేశ్ ను.. రేవంత్ రమ్మని పిలుస్తారా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి. ఏమైనా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలకు బండ్ల కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని చెప్పాలి.