టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని పలువురు ప్రశంసించిన సంగతి తెలిసిందే. విజన్-2020 పేరుతో 1998లోనే హైదరాబాద్లో హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడు అంకురార్పణ చేశారు. చంద్రబాబు కలలుగన్నట్లుగానే 2020 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోనే ఐటీ సేవలందించే ముఖ్య నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ముఖ్యంగా భారతదేశంలో బెంగళూరు, చెన్నైలతో పోటీపడి మరీ ఐటీ రంగంలో హైదరాబాద్ నెంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై, ఆయన విజన్ పై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్ ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వ్యవహారాలపై తనదైన రీతిలో స్పందించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు విజన్-2020 అనే వారని, ఆరోజుల్లోో అదేంటో తనకు అర్థం అయ్యేది కాదని బండ్ల గణేష్ అన్నారు. కానీ ఇటీవల బ్యాంకాక్ నుంచి వచ్చిన హైదరాబాద్ ను చూసి ఆశ్చర్యపోయాడని, అపుడు తనకు చంద్రబాబు నాయుడు విజన్ గురించి అర్థమైందని చెప్పారు.
తన మిత్రుడు హైదరాబాద్లోని ఐటిసి హోటల్లో బస చేశాడని, హైదరాబాద్ కూడా విదేశాలకు తలదన్నే రీతిలో సౌకర్యాలను కల్పించడంతో ఆశ్చర్యపోయాడని అన్నారు. తన మిత్రుడు హైటెక్ సిటీ డెవలప్ అయిన తీరు, సైబరాబాద్ రూపు రేఖలు చూసి ఆశ్చర్యపోయాడని అన్నారు. బ్యాంకాక్ కన్నా హైదరాబాద్ నగరం బాగుందని కితాబిచ్చాడని బండ్ల గణేష్ గుర్తు చేశారు.
ఈరోజు హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదిగింది అంటే అది చంద్రబాబు చలవేనని బండ్ల గణేష్ ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలో అన్ని రాష్ట్రాల వారు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఉంటున్నారని, అతి తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలు అందిస్తున్నందున వారంతా హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారని అన్నారు. ఇక, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు తన భార్య చికిత్స కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాలను వదిలేసి హైదరాబాద్లోని ఏజీఐ ఆసుపత్రిలో చికిత్స చేయించారని గుర్తు చేశారు.
అంతటి ఘనత హైదరాబాద్ సాధించడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు విజనే కారణమని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో కులం, మతం ప్రాంతం భాషలకు అతీతంగా అందరూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని, దీనిని విశ్వ నగరంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని బండ్ల కితాబిచ్చారు. అయితే, అటువంటి హైదరాబాద్ లో మత రాజకీయాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బండ్ల ఆరోపించారు. హిందూ మతాన్ని కేసీఆర్ గౌరవిస్తారని, ఆయన పరమ భక్తుడని, అటువంటి నేతలు బీజేపీలో లేరని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ లపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.